Begin typing your search above and press return to search.

వైసీపీకి అవకాశం ఇచ్చిన యనమల

By:  Tupaki Desk   |   28 April 2016 4:50 PM GMT
వైసీపీకి అవకాశం ఇచ్చిన యనమల
X
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్‌ జగన్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న తెలుగుదేశం-బీజేపీల మ‌ధ్య అంత‌రానికి బీజం వేస్తోంది. త‌మ ఎమ్మెల్యేలకు డబ్బు ఎరవేసి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నార‌ని పేర్కొంటూ సేవ్ డెమోక్ర‌సీ పేరుతో జ‌గ‌న్ హ‌స్తిన బాట ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న కేంద్ర హోంమంత్రి మొద‌లు అన్ని పార్టీల పెద్ద‌లను క‌లుస్తున్నారు. అంతేకాకుండా సీఎంగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత అవినీతి పెరిగిపోయిందంటూ పుస్త‌కం ముద్రించి అంద‌జేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌పై టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ఢిల్లీలో జ‌గ‌న్ ప‌ర్య‌టించ‌డం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమని య‌న‌మ‌ల విమ‌ర్శించారు. తన తండ్రి రాజశేఖర్‌ రెడ్డి ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రారంభించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు జగన్‌ ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలని య‌న‌మ‌ల‌ డిమాండ్‌ చేశారు. అభివృద్ధిలో భాగ‌స్వామ్యం అయ్యేందుకు ఎమ్మెల్యేలు పార్టీ మారుతుంటే దుష్ప్రచారం చేయడం స‌రికాద‌ని హిత‌వు ప‌లికారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రుల‌పై య‌న‌మ‌ల స్పందించారు. ఆర్థిక నేరాలకు పాల్పడి జైలు జీవితం గడిపి వచ్చిన జగను కేంద్రమంత్రులు - పెద్దలు కలవకుండా ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులను ప్రముఖ స్థానాల్లో ఉన్నవారు ప్రోత్సహిస్తే ప్రజల్లో అపోహలు పెరుగుతాయని య‌న‌మ‌ల అన్నారు.

చూస్తుంటే జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌తో టీడీపీలో క‌ల‌క‌లం రేగుతుంద‌న్న వైసీపీ శ్రేణుల వ్యాఖ్య‌లు నిజ‌మనే అంటున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న వ్య‌క్తి వ‌చ్చిన‌పుడు ఆయ‌న హోదాకు అయిన ప్రాధాన్యం ఇచ్చి అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం రాజ‌కీయ నీతి. దీనిపై య‌న‌మ‌ల అసంతృప్తి స‌రికాదేమోన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.