Begin typing your search above and press return to search.

యాదాద్రి నమూనా బొమ్మలు అదిరిపోయాయి

By:  Tupaki Desk   |   29 Sep 2016 5:59 AM GMT
యాదాద్రి నమూనా బొమ్మలు అదిరిపోయాయి
X
సినిమా సెట్టింగుల్ని తలదన్నేలా యాదాద్రి నమూనాలు ఉన్నాయి. సినిమాలకు కళా దర్శకత్వం వహేంచే వ్యక్తే స్వయంగా డిజైన్ చేస్తున్న వేళ యాదాద్రి సినిమా సెట్టింగ్ లను తలపించేలా ఉండటంలో ఆశ్చర్యమేమీ ఉండదేమో. అద్భుత శిల్ప కళా రూపాలతో.. దైవత్వం ఉట్టిపడేలా.. చూపురులను కట్టిపడేసేలా ఉన్న యాదాద్రి నమూనా చిత్రాలు ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. చివరకు యాద్రాద్రిని ఎలా తయారు చేస్తారు? నమూనాలో చూపించిన విధంగా యాదాద్రి ఉంటుందా? ఉండదా? అన్న విషయాల్నిపక్కన పెడితే.. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన ఫోటోలు మాత్రం అదిరిపోయేలా ఉన్నాయని చెప్పక తప్పదు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలల ప్రాజెక్టులలో ఒకటైన యాదాద్రికి సంబంధించిన పలు త్రీడీ నమూనాల్ని చూసిన కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అద్భుత శిల్ప కళారూపాలతో భక్తజనకోటి మనసు దోచుకునేలా యాదాద్రిని సిద్ధం చేయాలని.. మరో తిరుమల క్షేత్రంగా వృద్ధి చేయాలని కేసీఆర్ తపించటం తెలిసిందే. ఇందుకు తగ్గట్లే ఆయన భారీ ఎత్తున కసరత్తు చేశారు. తాజాగా ప్రధాన ఆలయ సముదాయాల నిర్మాణం.. కాటేజీలకు సంబందించిన త్రీడీ విడియో చిత్రాలతో పాటు.. ఫోటోల్ని ఆయ‌న‌ పరిశీలించారు.

నమూనాలే కాదు.. పనులు జరుగుతున్న తీరును సమీక్షించిన కేసీఆర్.. ప్రస్తుతం 500 మంది నిష్ణాతులైన శిల్పులు యాదాద్రిలో శిల్పాలు చెక్కటంలో మునిగి ఉన్నారని.. వచ్చే దసరా నాటికి యాదాద్రిని సుందరంగా సిద్ధం చేయనున్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్నారు. కాటేజీలకు సంబంధించి కొన్ని మార్పులు సూచించిన ముఖ్యమంత్రి.. యాదాద్రిలో పెంచే పచ్చదనంతో అక్కడ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని చెప్పటం గమనార్హం. ఇక యాదాద్రిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న 108 అడుగుల ఎత్తు అంజనేయస్వామి విగ్రహానికి సంబంధించిన పనుల కోసం చైనాకు వెళ్లాలని అధికారులు డిసైడ్ చేశారు. అధికారులతో కలిసి ఆర్కిటెక్ట్ ఆనందసాయి.. చైనాకు వెళ్లి అంజనేయస్వామి విగ్రహాన్ని రూపొందించేందుకు అవసరమైన ఒప్పందాన్ని పూర్తి చేసుకు రానున్నారు. నమూనా చిత్రాల్ని చూస్తుంటే.. కేసీఆర్ కోరుకున్నట్లే తిరుమల మాదిరి యాదాద్రిని అభివృద్ధి చేయాలన్న కోరిక ఫలించేలా ఉందనటంలో సందేహం లేదని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/