వైసీపీ అంచనా ఇదేనా!... లెక్క పక్కానేనట!

Mon Feb 18 2019 20:16:32 GMT+0530 (IST)

ఏపీ అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. ఈ నెలాఖరో - వచ్చే నెల తొలి వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ పక్కానే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో విపక్షాల్లో నుంచి అధికార పార్టీలోకి వలసలు సాధారణం. అయితే ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా సాగుతోంది. అధికార పార్టీకి ఈ దఫా గెలుపు కలేనన్న వాదనే ఈ తరహా భిన్న పరిస్థితికి కారణమైందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. గెలిచే పార్టీలోనే కొనసాగడం రాజకీయ నాయకుల లక్షణంగా ఇటీవలి కాలంలో సరికొత్త వ్యూహాలు అమల్లోకి వచ్చేశాయి. అప్పటిదాకా తాము ఉంటున్న పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయనుకుంటే.. ఆ పార్టీకి దూరం జరిగే నేతలు దాదాపుగా ఉండరు. అదే సమయంలో తాము ఉంటున్న పార్టీ ఓడిపోతుందన్న భావన వస్తే మాత్రం నేతలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. ఈ తరహా వైఖరి ఇటీవలి కాలంలో బాగానే కనబడుతోంది.ఇప్పుడు ఏపీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలపై తమ తమ మార్గాల్లో విశ్లేషించుకున్న నేతలు... తమ పార్టీల విజయావకాశాలపై కాస్తంత స్పష్టతగానే ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓడిపోయే అవకాశాలున్న టీడీపీలో కొనసాగడం ఇక దండగేనన్న భావనతో ఆ పార్టీ నేతలు వరుసగా పార్టీ అధిష్ఠానానికి వరుస షాకులిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు - ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసేసి... వైసీపీలో చేరిపోయారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టీడీపీ ఎదుర్కోబోయే దుస్థితిని ఇట్టే కళ్లకు కట్టేశాయని చెప్పాలి. రాష్ట్రంలోని మొత్తం రాజకీయ పరిస్థితులపై తమదైన కోణంలో బేరీజు వేసుకున్న వైసీపీ... ఈ దఫా తమ విజయం పక్కానేనని ఓ నిర్ధారణకు వచ్చింది. అదే సమయంలో ఈ ఎన్నికల్లో గెలుపుపై అంత ధీమా టీడీపీలో కనిపించడం లేదు.

వెరసి టీడీపీ నుంచి తమ పార్టీలోకి వలసలు ఖాయమని ఓ అంచనాకు వచ్చిన వైసీపీ... ఎంతమంది తమ పార్టీలోకి వస్తారన్న విషయంపై ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చినట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. ఈ అంచనాల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే టీడీపీ నుంచి ఏకంగా ఆరుగురు ఎంపీలు 50 మంది ఎమ్మెల్యేల దాకా రాజీనామాలు చేయనున్నారని - వీరంతా తమ పార్టీలోకే వస్తే.. వారిని అకామిడేట్ చేయడమెలా? అన్న కోణంలోనూ వైసీపీ ఇప్పటికే ఓ బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పార్టీ టికెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. గడచిన ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు కలిగించవద్దన్న కోణంలో సీటు దక్కకున్నా సైలెంట్ గా ఉండిపోయామని - ఈ దఫా మాత్రం తమకు సీటు కేటాయించాల్సిందేనని పట్టుబట్టే నేతల సంఖ్య కూడా చాలానే ఉంది.

మరి వీరందరినీ బుజ్జగించి టీడీపీ నుంచి వచ్చే నేతలకు టికెట్ల కేటాయింపునకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తగా వ్యూహ రచన చేసినట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే... గత వారం జరిగిన పరిణామాలను చూస్తుంటే... వైసీపీ అంచనాలు నిజమయ్యేలానే పరిస్థితి ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. పార్టీ మారుతున్నట్లుగా నేతలపై ప్రచారం జరగడం ఆ తర్వాత వారంతా అబ్బే - అలాంటిదేమీ లేదే అంటూ వ్యాఖ్యలు చేయడం - ఆ మరునాడే పార్టీకి షాకిస్తూ వైరి వర్గంలో చేరిపోతుండటం చూస్తుంటే... వైసీపీ అంచనాల మేరకు టీడీపీకి భారీ దెబ్బ పడిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. వైసీపీ అంచనాలు నిజమయ్యే పక్షంలో టీడీపీ ఎన్నికలకు ముందే చాప చుట్టేయడం ఖాయమేనన్న కోణంలో పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగుతున్నాయి.