Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌, కాంగ్రెస్‌... ఓ బంద్‌

By:  Tupaki Desk   |   29 Aug 2015 6:07 AM GMT
జ‌గ‌న్‌, కాంగ్రెస్‌... ఓ బంద్‌
X
ప్రజాసమస్యలపై ఏ ప్రతిపక్ష పార్టీ అయినా బంద్‌ కు పిలుపునిస్తే మిగతా పార్టీలు మద్దతిస్తుంటాయి. రాజకీయాల్లో ఇది ఆనవాయితీ. ప్రతిపక్ష పార్టీలు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు దొరికే ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోవు. క‌నీసం అంశాల వారి మ‌ద్ద‌తు అయినా ఇస్తుంటాయి. కానీ ఏపీలోని ప్ర‌తిప‌క్ష‌పార్టీలు అయిన వైఎస్ ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్‌ పార్టీది డిఫ‌రెంట్ సెట‌ప్‌. ఆ రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీకి వ్య‌తిరేకంగా పోరాడుతాయి. కానీ ఎవరిదారి వారిదే. ఒకరితో మరొకరు అస్సలు కలవడంలేదు. అజెండా ఒక్కటే అయినా జెండాలు వేర్వేరన్నది ఈ పార్టీల లెక్క.

కొద్ది రోజుల క్రితం ఏపీ కాంగ్రెస్‌ ప్రత్యేక హోదా డిమాండ్‌ తో బంద్‌ కు పిలుపునిచ్చింది. అప్పుడు వైసీపీ మినహా మిగతా పార్టీలన్నీ బంద్‌ కు మద్దతిచ్చాయి. ఇప్పుడు అదే అంశంపై వైసీపీ బంద్‌ కు పిలుపునిచ్చింది. ఈసారి కాంగ్రెస్‌ మినహా మిగతా పార్టీలు మద్దతిచ్చాయి! వైసీపీ, కాంగ్రెస్‌ లు పరస్పరం మద్దతు ఇచ్చుకోకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి అప్పుడు వైసీపీని కాంగ్రెస్‌ అడగలేదు... ఇప్పుడు కాంగ్రెస్‌ వైసీపీ మద్దతు కోరలేదు. ఒకవేళ అడిగినా అది జరిగే పని కాదన్నట్లుంటున్నాయి రెండు పార్టీలు.

రాహుల్‌ అనంతపురం పర్యటనలో అధికార టీడీపీతో పాటు, ప్రతిపక్ష వైసీపీని టార్గెట్‌ చేశారు. ఏపీలో బలపడాలని చూస్తున్న కాంగ్రెస్‌... ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీని టార్గెట్‌ చెయ్యడం ఫ్యాన్‌ పార్టీ నేతలకు ఏమాత్రం మింగుడుపడలేదు. రాహుల్‌ టూర్‌ తర్వాత కాంగ్రెస్‌ నిదానంగా పుంజుకుంటుందన్న భావనలో ఉంది వైసీపీ. అందుకే బంద్‌ విషయంలో ఆ పార్టీని దూరంగా పెట్టినట్టు తెలుస్తోంది.

గతంలో జగన్‌ విషయంలో కాంగ్రెస్‌ పార్టీకి సాఫ్ట్‌ కార్నర్‌ ఉండేది. కానీ ప్రత్యేక హోదాపై ఢిల్లీలో జగన్‌ చేసిన ధర్నాలో నేరుగా రాహుల్‌ పై విమర్శలు చేయడాన్ని ఏపీ కాంగ్రెస్‌ సీరియస్‌గా తీసుకుందని సమాచారం. అప్పట్నుంచే ఈ రెండు పార్టీల మధ్య వ్యవహారం చెడిందని తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్‌ బంద్‌ పిలుపుకు వైసీపీ మద్దతు ఇవ్వలేదట. ఏపీలో బలపడాలని చూస్తున్న కాంగ్రెస్‌ వైసీపీకి దూరంగా ఉండడమే మంచిది అనుకుంటోందట. అలా దూరంగా ఉంటేనే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలపడుతుందని, అప్పుడే సత్తా ఏంటో పక్కాగా లెక్కలేయొచ్చని అనుకుంటోందట. సో... ఈ లెక్కన ఈ రెండు పార్టీలు కలిసి పోరాటాలు చేయడం ఇప్పట్లో జరిగేపని కాదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.