ఆ మంత్రి రోజాను అవమానించారా... అవమానం పాలయ్యారా?!

Sun Aug 13 2017 21:35:47 GMT+0530 (IST)

నంద్యాల ఉప ఎన్నిక వేడిలో మాటలు పరిధి మించుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాలను మించి వ్యక్తిగత అంశాల స్థాయికి కూడా నాయకుల కామెంట్లు చేరిపోతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవి పొందిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్కే రోజాపై మంత్రి ఆదినారాయణ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ``దుస్తులు లేకుండా తిరిగేవాళ్ళు వాటి గురించి మాట్లాడే అర్హత లేదు`` అని ఆది నారాయణ రెడ్డి అన్నారు.సీనియర్ నాయకుడైన మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. క్రమశిక్షణకు మారుపేరుగా ప్రచారం చేసుకుంటూ సమాజమే దేవాలయం అనే ట్యాగ్‌లైన్‌గా కలిగిన పార్టీ నాయకుడిగా చెప్పుకొంటున్న ఆదినారాయణ రెడ్డి తీరును పలువురు ప్రశ్నించారు. మరోవైపు వైసీపీ శ్రేణులు సైతం భగ్గుమన్నాయి. మంత్రి హోదాలో ఉన్న ఆదినారాయణరెడ్డి మహిళా ఎమ్మెల్యే పట్ల వ్యవహరించిన తీరును నిరసించాయి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మహిళా విభాగం నేతలు పార్టీ మహిళా నాయకురాల్లు మంత్రి ఆదినారాయణరెడ్డి దిష్టిబొమ్మలు దగ్దం చేశారు. పలు చోట్ల దున్నపోతు బొమ్మకు మంత్రి ఆదినారాయణ రెడ్డి ఫ్లెక్సీని కట్టి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి తీరు దున్నపోతుతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రమైన గుంటూరుతో పాటు ఉత్తరాంధ్రలోని విశాఖ శ్రీకాకుళం జిల్లాలోనూ ఈ నిరసనలు జోరుగా సాగాయి. నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. క్రమశిక్షణ కల పార్టీ అని ప్రచారం చేసుకునే తెలుగుదేశం నాయకులు మహిళలను ఈ రీతిలో విమర్శించడమే సదరు సంస్కారం అనిపించుకుంటుందా అంటూ నిప్పులు చెరిగారు. స్వర్గీయ రాజశేఖరరెడ్డి గారికి వెన్నంటే ఉంటూ అనేక పదవులను అనుభవించి ఆయన తనయుడు వైఎస్ జగన్‌కు వెన్నుపోటు పొడిచి మరొక పార్టీలోకి వెళ్లిన ఘనత ఆదినారాయణరెడ్డి సొంతమని మండిపడ్డారు. మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం మహిళ ఎమ్మెల్యే అయిన రోజాపై దిగజారి వ్యాఖ్యలు చేస్తున్న ఆదినారాయణ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా మహిళా అధ్యక్షురాలు సాయిబాల పద్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ నంద్యాల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో మతిభ్రమించి ఆదినారాయణరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఓటుకు రూ.5000 ఇస్తానని మీడియా సాక్షిగా నంద్యాల ప్రజల సాక్షిగా చంద్రబాబు మాట్లాడారని ఆమె గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమానికి పాటుపడని విషయాన్ని ఒప్పుకోకుండా ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ప్రజాప్రతినిధులను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని జిల్లా అధ్యక్షురాలు పద్మ ఆరోపించారు.