Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ జాగ్ర‌త్త‌.. ఆ సీపీఐ నేత బాబు మ‌నిషి

By:  Tupaki Desk   |   25 Jun 2018 5:09 PM GMT
ప‌వ‌న్ జాగ్ర‌త్త‌.. ఆ సీపీఐ నేత బాబు మ‌నిషి
X
రాబోయే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తానంటూ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డంతో పాటుగా భావ‌సారూప్య‌త గ‌ల వివిధ పార్టీల‌తో చ‌ర్చలు జ‌రుపుతున్న జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ను ఏపీలోని రాజ‌కీయ ప‌రిణామాల గురించి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చ‌రించింది. వైఎస్ ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి - సంతనూతలపాడు సమన్వయకర్త టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఈ మేర‌కు తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. సీపీఐ రామకృష్ణ వైఎస్‌ జగన్‌ పై విమర్శలు చేయడం సరికాదని ఆయ‌న అన్నారు. సీపీఐ జాతీయ నాయకత్వంతో తమకు ఎలాంటి విభేదాలు లేవని అయితే రామకృష్ణ విష‌యంలో కొన్ని అభ్యంత‌రాలు ఉన్నాయ‌న్నారు. ఆయ‌న చంద్రబాబుకు తొత్తుగా మారారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ కు ముఖ్యమంత్రి కావాలని ఉంద‌ని రామకృష్ణ విమర్శించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని, అన్ని వర్గాల ప్రజలు వైఎస్‌ జగన్‌ ను ముఖ్యమంత్రిని చేయాలని ఎదురుచూస్తున్నారన్నారు. వ్యాపార దృక్ఫథంతో రామకృష్ణ చంద్రబాబుకు తొత్తుగా మారారని ఆరోపించారు.

రామకృష్ణ చంద్రబాబు మనిషి అని, ఆయన విషయంలో పవన్‌ కళ్యాణ్‌ జాగ్రత్తగా ఉండాలని సుధాక‌ర్ బాబు సూచించారు. అగ్రిగోల్డు వ్యవహారంలో రామకృష్ణ మనిషి ముప్పాల నాగేశ్వరరావుకు సంబంధాలు ఉన్నాయన్నారు. మీ వద్దకు రామకృష్ణ వస్తే ఈ విషయంపై పవన్‌ ప్రశ్నించాలన్నారు. అగ్రిగోల్డు వ్యవహారంలో నాగేశ్వరరావుకు ఉన్న సంబంధాలు ఏంటో చెప్పాలన్నారు. తాను చేసిన ఆరోపణల్లో పస లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఆగ్రిగోల్డు వ్యవహారంలో రామకృష్ణకు ఎంత ముట్టాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జనసేనతో పొత్తు విష‌యంలో కలిసి పోటీ చేస్తామని మేం ఎక్కడా చెప్పలేదని సుధాకర్‌ బాబు తెలిపారు.

ఏపీలో రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వం కొన‌సాగుతోంద‌ని సుధాక‌ర్ బాబు మండిప‌డ్డారు. రాజధాని పేరుతో రైతుల నుంచి తీసుకున్న భూములను సింగపూర్‌ కు కారు చౌకగా ధారదత్తం చేశారన్నారు. రాజధాని పేరుతో టీడీపీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుందని విమర్శించారు. రైతుల వెన్ను విరిచారు..రైతు కూలీల ఉపాధి పోగొట్టారని, సామాన్యుల భూములు లాక్కొని సింగపూర్‌ కు ధారదత్తం చేశారని మండిపడ్డారు. అట్టహాసంగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాలుగేళ్లలో ఏం చేయలేదన్నారు. టీడీపీ నేతలు దోపిడీ దొంగలని - పేదల భూములు లాక్కున్నారన్నారు. ఒక రేషన్‌ కార్డుకు రూ.2500 పింఛన్‌ ఇచ్చి వారి జీవితాలను సర్వనాశనం చేశారని సుధాక‌ర్ బాబు మండిప‌డ్డారు. సామాన్యుల భూములపై లింగమనేని రమేష్‌ కన్నుపడిందన్నారు. ఈ కుంభకోణంలో లోకేష్‌ వాటా ఎంతో చెప్పాలన్నారు.లింగమనేని ఎస్టేట్‌ అక్రమ కట్టడమని, అందులో చంద్రబాబు నివాసం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. లింగమనేని ఎస్టేట్ - రాజధాని భూములపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆయన డిమాండు చేశారు. లింగమనేని ఎస్టేట్‌ అక్రమ కట్టడమని - అలాంటి ఇంటిలో ముఖ్యమంత్రి నివాసం ఉండటం సరికాదన్నారు. 2014 కంటే లింగమనేని ఆస్తులు - ఆదాయం - ఆ తరువాత ఉన్న వాటిపై విచారణ చేపట్టాలన్నారు. మా వద్ద అన్ని అధారాలున్నాయని - సీబీఐ విచారణ ఏర్పాటు చేస్తే మేం సమర్పిస్తామన్నారు.