చంద్రగిరి రీపోలింగ్ లోనూ తేడా కొట్టిందిగా?

Mon May 27 2019 11:51:05 GMT+0530 (IST)

రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన చంద్రగిరి రీపోలింగ్ లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి?  ఏ పార్టీ అధిక్యతను ప్రదర్శించింది? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం చెప్పే క్రమంలో పార్టీల వారీగా ఓట్లు పడిన తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.విచిత్రమైన విషయం ఏమంటే.. చంద్రగిరి రీపోలింగ్ లో వచ్చిన ఓట్లను చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.  2014తో పోలిస్తే ఈసారి  వైఎస్సార్ కాంగ్రెస్ అధిక్యత కొట్టొచ్చినట్లు కనిపించక మానదు. అయితే.. రీపోలింగ్ జరిగిన ఏడు చోట్లలో కేవలం రెండు చోట్ల మాత్రమే జగన్ పార్టీకి అధిక్యత లభించిందని.. మిగిలిన ఐదు చోట్ల తమకే ఎక్కువ ఓట్లు పడినట్లుగా తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.

అయితే.. వారు మర్చిపోతున్న పాయింట్ ఏమంటే.. 2014తో పోలిస్తే.. తాజాగా జరిగిన ఎన్నికల్లో చాలాచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ అధిక్యత కొట్టొచ్చినట్లుగా కనిపించింది.  2014లో వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీకి కాళేపల్లి.. కప్పంబాదూరులలో అధిక్యత వస్తే.. పులివర్తివారిపల్లె.. వెంకట్రామాపురం.. కొత్త కండ్రిగ.. కమ్మపల్లె.. ఎన్.ఆర్. కమ్మపల్లెల్లో టీడీపీ అధిక్యత ప్రదర్శించింది. ఈసారి అదే తీరును కనిపిస్తున్నా.. 2014తో పోలిస్తే అన్ని చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అధిక్యతను కొట్టొచ్చినట్లు కనిపించింది. ఉదాహరణకు కమ్మపల్లెనే తీసుకుంటే 2014లో టీడీపీకి 741 ఓట్లు పడితే.. తాజా ఎన్నికల్లో టీడీపీకి 413 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఆ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడింది.

అదే విధంగా కొత్త కండ్రిగలో 2014లో టీడీపీకి 812 ఓట్లు పడగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 33 ఓట్లు మాత్రమే పడ్డాయి. కానీ.. తాజా ఎన్నికల్లో టీడీపీకి కేవలం 578 ఓట్లు రాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 272 ఓట్లు పోలయ్యాయి. ఇలా.. తనకు ప్రతికూలంగా పల్లెల్లో కూడా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో బలపడటం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి.