Begin typing your search above and press return to search.

రోజా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు

By:  Tupaki Desk   |   26 July 2017 7:07 AM GMT
రోజా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
X
ఎక్కడైనా ఫ్లోలో రాజకీయ నాయకులు లేదా సినిమా నటులు రకరకాల హామీలు ఇస్తుంటారు కాని వాటి మీద నిలబడే వారు మాత్రం తక్కువగా ఉంటారు.ఎవరు గుర్తుంచుకుంటారు - ఎవరు అడుగుతారు అనే నిర్లక్ష్య ధోరణే కారణం. కాని నటి - నగరి నియోజకవర్గ ఎంఎల్ ఎ - వైఎస్ ఆర్ సిపి విమెన్ వింగ్ ప్రెసిడెంట్ రోజా మాత్రం తాను భిన్నం అని మరో సారి రుజువు చేసుకున్నారు.

ఆ మధ్య స్టార్ మా ఛానల్ లో చిరంజీవి వ్యాఖ్యాతగా వచ్చిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో రోజా పాల్గొన్నారు. చాలా ఆసక్తికరంగా జరిగిన ఆ షోలో 6 లక్షల పై చిలుకు మొత్తం గెలుచుకున్న రోజా ఆ డబ్బును ఏం చేస్తారు అని ప్రశ్నించిన చిరంజీవితో నగరిలో ఉన్న ఆసుపత్రి అభివృద్ధి కోసం ఖర్చు పెడతాను అని అప్పుడే ప్రకటించారు. దీనికి చిరంజీవితో పాటు ఆడియన్స్ కూడా తమ కరతాళధ్వనుల ద్వారా తమ హర్షం వ్యక్తం చేసారు. గేమ్ షో అమౌంట్ కాబట్టి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని చివరికి రోజాకు అందింది. ఆ మొత్తం టాక్స్ డిడక్షన్ పోను నాలుగు లక్షల నలభై ఒక్క వేల రూపాయల దాకా చెక్ అమౌంట్ వచ్చింది.

ఆనాడు చెప్పిన ప్రకారం రోజా నగరి 100 పడకల ఆసుపత్రి వద్ద పేషెంట్లు - వారి సంబంధీకుల సౌకర్యార్థం బస్సు షెల్టర్ కోసం స్థలం సేకరించి ఆ మేరకు అనుమతి తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఉన్నా అధికారులతో పోరాడి చివరికి సాధించారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ నిత్యం వందలాది పేషెంట్లు వచ్చే ఈ హాస్పిటల్ కి కొన్ని సౌకర్యాలు లేనందుకు బహుమతిగా వచ్చిన మొత్తాన్ని ఇలా వినియోగించడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు. స్థలం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికి వాటిని అధిగమించి బస్సు షెల్టర్ కోసం పూజ చేయటం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసారు. అబద్దపు హామీలు ఇచ్చి మోసం చేసే కొందరు నాయకుల కన్నా తన వ్యక్తిగత సొమ్మును సైతం ఇలా ప్రజా ప్రయోజన కార్యక్రమం కోసం ఉపయోగించినందుకు నగరి ప్రజలు రోజాపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.