Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల సాక్షిగా టీడీపీకి వైసీపీ షాకిస్తుందా?

By:  Tupaki Desk   |   27 Feb 2017 7:39 AM GMT
ఎన్నిక‌ల సాక్షిగా టీడీపీకి వైసీపీ షాకిస్తుందా?
X
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును తీవ్ర ఇర‌కాటంలో ప‌డేసే విధంగా ప్రధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంద‌ని అంటున్నారు. వైసీపీ నుంచి అధికారపక్షమైన‌ టీడీపీలోకి దశలవారీగా 21 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. తమ పార్టీ చిహ్నంపై గెలిచి వేరొక పార్టీలో చేరిన వారిని డిస్‌ క్వాలిఫై చేయించాలని వైసీపీ వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తుండగా, ప‌సుపు కండువా క‌ప్పుకొన్న వారిపై అనర్హత వేటు ప‌డ‌కుండా కాపాడుకునేందుకు టీడీపీ ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా ఎదుర్కొంటూ వస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఏపీ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానాల భర్తీకి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మరోసారి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత (డిస్‌ క్వాలిఫై) అంశం తెరమీదికొచ్చింది.

శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల సంద‌ర్భంగా త‌మ పార్టీ ద్వారా గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల‌ను అన‌ర్హ‌త వేటు ప‌డేలా వైసీపీ ఎత్తులు వేస్తోంద‌ని చెప్తున్నారు. ఇందుకోసం ఎన్నిక‌లు జ‌రిగే స‌మ‌యంలో విప్ జారీ చేసి ఓటింగ్ వేసేలా చూస్తార‌ని అంటున్నారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఓటు వేసిన వారిపై స్పీక‌ర్‌ కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అక్క‌డ ఫ‌లితం రానిప‌క్షంలో తిరిగి న్యాయ‌స్థానంలో తేల్చుకోవాల‌ని ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ భావిస్తున్న‌ట్లు చెప్తున్నారు. అదే స‌మ‌యంలో క్షేత్ర‌స్థాయిలో స‌ద‌రు ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి వారి తీరును ప్ర‌జాస్వామ్య‌ప‌ద్ద‌తిలోనే ఎండ‌గ‌ట్టాల‌ని వైసీపీ భావిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇలా వివిధ రూపాల్లో జంప్ జిలానీ ఎమ్మెల్యేల తీరును ప్ర‌జ‌ల్లోకి చేర‌వేయ‌డంతో పాటుగా పార్టీప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ ముందుకు సాగితే ఎన్నిక‌ల నాటికి పార్టీకి అవ‌స‌ర‌మైన ప‌ట్టు దొరుకుతుంద‌ని వైసీపీ కీల‌క వ‌ర్గాలు భావిస్తున్న‌ట్లు చెప్తున్నారు.

కాగా, గ‌త ఏడాది అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే పిరాయించిన ఎమ్మెల్యేల‌పై డిస్‌ క్వాలిఫై లక్ష్యంతో చంద్రబాబు మంత్రి మండలి పైనా - స్పీకర్‌ కోడెల పైనా వైసీపీ వెంటవెంటనే అవిశ్వాస తీర్మానాలు ప్రతిపాదించగా, అధికారపక్షం జిమ్మిక్కులతో ఫిరాయింపుదార్లను ఆ గండం నుంచి తప్పించింది. సమావేశాల చివరి రోజున ద్రవ్యవిని మయ బిల్లుపై ఓటింగ్‌ కు పట్టుబట్టినప్పుడూ అదే పని చేసింది. గతేడాది రాజ్యసభ ఎన్నికల సమయంలోనూ డిస్‌ క్వాలిఫై వ్యవహారం ముందుకొచ్చినా అధికార - విపక్షాలు పోటీ పెట్టకపోవడంతో కథ‌ సుఖాంతమైంది. మరలా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు, ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఫిరాయింపుదార్లపై అనర్హత మళ్లీ చర్చల్లోకొచ్చింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పనిసరిగా డిస్‌ క్వాలిఫై అంశం ముం దుకురావ‌డంతో వైసీపీ వ్యూహాత్మ‌కంగా పావులు కదుపుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/