Begin typing your search above and press return to search.

చిత్తూరు వైసీపీలో ర‌గ‌డ‌

By:  Tupaki Desk   |   26 Aug 2016 10:08 AM GMT
చిత్తూరు వైసీపీలో ర‌గ‌డ‌
X
వైసీపీలో ఒక‌ప్పుడు యాక్టివ్ గా ఉండి గ‌త ఏడాది కాలంగా స్త‌బ్దుగా ఉన్న చిత్తూరు జిల్లా తంబ‌ళ్ల‌ప‌ల్లి మాజీ ఎమ్మెల్యే ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి మ‌ళ్లీ వేగం పెంచారు. పెంచారు అనే కంటే పెంచాల్సిన ప‌రిస్థితులు వ‌చ్చాయి అన‌డం స‌రైన‌దంటున్నాయి వైసీపీ వ‌ర్గాలు. ఇటీవ‌ల వైసీపీ నిర్వ‌హించిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ కార్య‌క్ర‌మం సమయంలో రాష్ర్ట‌వ్యాప్తంగా కార్య‌క్ర‌మాలు జ‌రిగినా తంబ‌ళ్ల‌ప‌ల్లిలో ప్ర‌వీణ్ కుమార్ మాత్రం త‌న ఇంటి గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు రాలేదు. దీంతో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సోద‌రుడు ద్వారకానాథ్‌ రెడ్డికి నియోజ‌క‌వ‌ర్గ‌ బాధ్యతలు అప్పగించారు జ‌గ‌న్‌. దీంతో ప్ర‌వీణ్ మేలుకుని తాముండ‌గా ఆయ‌న‌కు ఎలా బాధ్య‌తలిస్తారంటూ గొంతెత్తారు. ద్వారకానాథ్‌ రెడ్డిని నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల నుంచి తప్పించాలని నియోజకవర్గంలోని బి.కొత్తకోట.. మొలకలచెరువు మండలాలలో ప్రవీణ్ వర్గీయులు నిర‌స‌న‌లు దిగారు. ప్రవీణ్‌ కే నియోజకవర్గం ఇన్‌ ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించాలంటూ ర్యాలీలు తీశారు.

నియోజకవర్గంలో తాను కాకుండా మరో నాయకుడు ఎవరున్నార‌న్న ఉద్దేశంతో ప్ర‌వీణ్ నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్లే జ‌గన్ ఈ స్టెప్ వేశార‌ని తెలుస్తోంది. దాంతో జ‌గ‌న్ ద్వారకానాథ్‌ రెడ్డిని నియమించడంతో ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి మ‌ళ్లీ యాక్టివ్ కావ‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. అదేస‌మ‌యంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన ప్రవీణ్ మ‌ళ్లీ అటువైపు చూస్తున్నార‌న్న ప్ర‌చార‌మూ భారీగా జ‌రుగుతోంది.

పార్టీని వీడే ఉద్దేశంతోనే ఆయ‌న కొద్దికాలంగా యాక్టివ్ గా లేర‌ని చెబుతున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో నియోజకవర్గ సమన్వయ కర్తగా ద్వారకానాథ్‌ రెడ్డిని నియమించడంపై రచ్చ చేసేందుకు ప్రవీణ్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఊరుకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెటుకు కూడా పొగ వ‌చ్చే ప్ర‌మాద‌ముంద‌ని ప్ర‌వీణ్ అనుకుంటున్నార‌ని... అయితే, టీడీపీయా - వైసీపీయా అన్న‌ది ఆయ‌న తేల్చుకోలేక‌పోతున్నార‌ని అనుచ‌ర‌వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే త‌నకు పార్టీ అన్యాయం చేసింద‌న్న ఉద్దేశం క‌లిగించేందుకు ఆయ‌న స్కెచ్ వేస్తున్నార‌ని చెబుతున్నారు. అయితే... యువ‌కుడైన ప్ర‌వీణ్ వంటివారిని వ‌దులుకోరాద‌నుకుంటున్న జ‌గ‌న్ త్వ‌ర‌లో ఆయ‌న్ను పిలిపించి మాట్లాడి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ గురించి కూడా హామీ ఇచ్చే అవ‌కాశాలున్నాయ‌ని చెబుతున్నారు. మొత్తానికి ప్ర‌వీణ్ వ్య‌వ‌హారం చిత్తూరు వైసీపీలో ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.