పార్లమెంటులో వైసీపీ వాయిదా తీర్మానం!

Tue Mar 13 2018 17:11:49 GMT+0530 (IST)

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని - విభజన హామీలన్నీ నెరవేర్చి ఏపీకి రావాల్సిన నిధులను తక్షణం విడుదల చేయాలని వైసీపీ ఎంపీలు పార్లమెంటులో కొద్ది రోజులుగా తీవ్రమైన ఆందోళనలు చేస్తోన్న సంగతి తెలిసిందే. పట్టువదలని విక్రమార్కులలాగా వైసీపీ ఎంపీలు మంగళవారం నాడు కూడా తమ నిరసనలు కొనసాగించారు. సభను ఏపీకి ప్రత్యేక హోదా - విభజన హామీలపై సభలో సమగ్ర - అర్థవంతమైన చర్చ జరగాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. దాంతోపాటు - రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి రాజ్యసభలో కాలింగ్ అటెన్షన్ నోటీసు ఇచ్చారు. ఏపీకి న్యాయం చేయాలంటూ పార్లమెంటు మెయిన్ గేట్ వద్ద వైసీపీ ఎంపీలు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలో మేకపాటి రాజమోహన్ రెడ్డి - వైవీ సుబ్బారెడ్డి - విజయసాయిరెడ్డి - మిథున్ రెడ్డి - అవినాష్ రెడ్డి - వరప్రసాద్ లు పాల్గొన్నారు.పార్లమెంటు బడ్జెట్ మలి విడత సమావేశాల్లో ఇటు ఏపీ....అటు తెలంగాణ ఎంపీలు తమ సమస్యలపై ఆందోళనలు చేస్తోన్న సంగతి తెలిసిందే. విభజన హామీలపై టీడీపీ - వైసీపీ - కాంగ్రెస్..... తెలంగాణలో రిజర్వేషన్ల కోటా అంశంపై టీఆర్ ఎస్ లు పార్లమెంటును స్తంభింపజేస్తున్నాయి. విభజన హామీలు నెరవేర్చాలంటూ మంగళవారం నాడు ఏపీ టీడీపీ ఎంపీలు పార్లమెంటులో తమ ఆందోళనలను కొనసాగించారు. ప్లకార్డులతో వెల్ లోకి దూసుకెళ్లారు. ఇటు వైసీపీ - అటు టీడీపీ ఎంపీల నిరసనలతో లోక్ సభ వాయిదా పడింది. ఆ తర్వాత పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ప్లకార్డులతో ఆందోళన చేశారు. ఆ నిరసనలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడు - ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు సిద్దార్థ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. విభజన హామీలు అమలు చేయాలన్న ప్లకార్డును ప్రదర్శిస్తూ సిద్దార్థ్....తన తండ్రితో పాటు ఆందోళన చేయడం పలువురు జాతీయ నేతల దృష్టిని కూడా ఆకర్షించింది. తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు గల్లా...ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.