వెంకయ్య విషయంలోనూ జగన్ ఫార్ములా అదే

Mon Jul 17 2017 23:06:34 GMT+0530 (IST)

బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ పక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు తమ మద్దతు తెలుపుతున్నట్లు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి స్పీకరు వంటి ఉన్నత రాజ్యాంగ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నిక జరగాలని అలాంటప్పుడే పదవికి ఎంపికైన వ్యక్తులు ఏ పార్టీకి చెందిన వారిగా ప్రవర్తించకుండా ఉంటారనేది తమ విధానంగా పలు సందర్భాల్లో వైసీపీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీకి చెందిన సీనియర్ నేత వెంకయ్యనాయుడు కు వైసీపీ మద్దతు ఉందని సమాచారం.

కాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఫోన్ చేసినట్లు సమాచారం. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగిన తెలుగువ్యక్తి వెంకయ్యనాయుడుకు మద్దతివ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమ మద్దతు ఉంటుందని అమిత్ షా కు వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరు ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా వెంకయ్యకు అభినందనలు తెలియజేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నామినేషన్ వేయనున్నారు.