22న విశాఖలో 'మహా' సంగ్రామం!

Mon Jun 19 2017 20:10:10 GMT+0530 (IST)

విశాఖ భూ ఆక్రమణలకు నిరసనగా జూన్ 22న విశాఖలో మహాధర్నా చేయాలని వైసీపీ నిర్ణయించింది. అదే రోజు టీడీపీ సైతం మహాసంకల్ప కార్యక్రమానికి సిద్దమవుతోంది. దీంతో ఎవరిది పైచేయి అవుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. అధికార ప్రతిపక్షాలు ఓకే రోజు నగరంలో కార్యక్రమాలు చేపట్టడంతో భారీ పొలిటికల్ ఫైట్ తప్పదని అందరూ భావిస్తున్నారు.

గతంలో ప్రత్యేక హోదా ఉద్యమం కోసం విశాఖకు వస్తున్న జగన్ ను అధికారులు విమానాశ్రయంలో అడ్డుకున్న  సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే తరహాలో ఆయన్ను ఎయిర్ పోర్టులోనే అడ్డుకుంటారనే వాదన వినిపిస్తోంది. అయితే వైసీపీ మాత్రం మహాధర్నా కోసం భారీ జన సమీకరణకు సిద్దమవుతోంది.

వైసీపీ ధర్నాను దెబ్బతీసేందుకు టీడీపీ భారీ ఎత్తున మహాసంకల్ప కార్యక్రమం చేపట్టబోతుంది. అధికార పక్షానికి పోలీసుల మద్దతు ఉంటుంది. రెండు పార్టీలు ఒకేరోజు సభలు ధర్నాలు నిర్వహించబోవడంతో ఆ రోజున విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశముందని రాజకీయ విశ్లేషకుల అంచనా.

టీడీపీ వైఖరి మీద వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కేవలం భూఆక్రమణల వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే.. టీడీపీ మహాసంకల్ప సభకు సిద్దమవుతోందని వారు ఆరోపిస్తున్నారు. భూములను కోల్పోయి  తీవ్ర ఆవేదనలో ఉన్న ప్రజలకు న్యాయం జరిగేందుకే  వైసీపీ మహాధర్నా చేపడుతోందని వారు చెబుతున్నారు. అధికార పక్షం ఎన్ని ఆటంకాలు ఏర్పరిచినా ప్రజలకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాటం కొనసాగుతుందని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/