Begin typing your search above and press return to search.

వైసీపీ బాబును టార్గెట్ చేస్తే..కేసీఆర్ కు ఇబ్బందే

By:  Tupaki Desk   |   13 Dec 2017 2:30 PM GMT
వైసీపీ బాబును టార్గెట్ చేస్తే..కేసీఆర్ కు ఇబ్బందే
X
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసే పాచిక తెలుగు రాష్ర్టాల్లో ప్ర‌కంప‌న‌ల‌కు దారితీస్తుందా? వ‌చ్చే పార్ల‌మెంటు స‌మావేశాల వేదిక‌గా వైసీపీ ఈ ఎత్తుగ‌డ‌కు సిద్ధ‌మైందా?  వైసీపీ వ్యూహం ఫ‌లిస్తే...తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులకు చిక్కులు ఖాయ‌మేనా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది రాజ‌కీయ‌ విశ్లేష‌కుల నుంచి  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గన్‌ మోహ‌న్‌ రెడ్డి త‌న పార్టీ ఎంపీల‌తో జ‌రిపిన చ‌ర్చ‌ల గురించి తెలిసిన వారు ఈ అంశాన్ని తెర‌మీద‌కు తెస్తున్నారు.

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో వైఎస్ జ‌గ‌న్‌ పాద‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రాబోయే పార్ల‌మెంటు స‌మావేశాల నేప‌థ్యంలో ఏ విధ‌మైన వ్యూహం అనుస‌రించాల‌నే అంశాన్ని చ‌ర్చించేందుకు వైసీపీ ఎంపీలు వైఎస్ జ‌గ‌న్‌ తో స‌మావేశ‌మ‌య్యారు. పార్టీ నేత‌ల వ‌ద్ద జ‌రిగిన చ‌ర్చ ప్ర‌కారం విభజన చట్టంలోని అన్ని అంశాలను పూర్తిచేసేందుకు పార్టీ నేత‌లు కృషిచేయాల‌ని వైఎస్ జ‌గ‌న్ ఆదేశించారు. ఇందుకోసం పార్ల‌మెంటు వేదిక‌గా పోరాటం చేయాలన్నారు. ఈ సంద‌ర్భంగా జంపింగ్ ఎంపీల అన‌ర్హ‌త వేటు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల ఉప‌రాష్ట్రప‌తి - రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు ఇద్ద‌రు ఎంపీల‌పై వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. సంబంధిత పార్టీల ఫిర్యాదు మేర‌కు ఉప‌రాష్ట్రప‌తి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో పాటుగా ఏ స‌భ అయినా అనర్హ‌త ఫిర్యాదు అందిన వారిపై త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.

ఈ అంశం వైఎస్ జ‌గ‌న్‌ - ఆ పార్టీ ఎంపీల స‌మావేశం సంద‌ర్భంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. వైసీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ఎంపీల్లో ఏపీ నుంచి ముగ్గురు - తెలంగాణ నుంచి ఒకరు పార్టీ ఫిరాయించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫిరాయింపులను సాక్షాత్తు ఇరు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులే ప్రోత్స‌హించారు. ఈ నేప‌థ్యంలో రాబోయే స‌మావేశాల్లో ఈ జంపింగ్ ఎంపీల‌పై ఫిర్యాదు చేయాల‌ని వైసీపీ నేత‌లు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. రాజ్య‌స‌భ‌లోని ఎంపీల‌పై వేటు వేసిన ఉదంతాన్ని స్పూర్తిగా తీసుకొని త‌మ పార్టీ  త‌ర‌ఫున గెలిచి ఇత‌ర పార్టీలో చేరి ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌ని వారిని డిస్ క్వాలిఫై చేయాల‌ని వైసీపీ డిమాండ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా వైసీపీ ఈ వ్యూహం అమ‌ల్లో పెడితే...ఇరు రాష్ర్టాల్లోనూ ఒక్క‌సారిగా రాజకీయ స‌మీక‌ర‌ణాలు మారిపోతాయ‌ని అంటున్నారు. ఆ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందేలా వ్యూహం ప‌న్నితే....అప్పుడు ఇరు రాష్ర్టాల ముఖ్య‌మంత్రుల ఫిరాయింపు రాజ‌కీయం తెలిసివ‌స్తుంద‌ని అంటున్నారు. ప్ర‌ధానంగా ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును ల‌క్ష్యంగా చేసుకున్న‌ప్పటికీ ఈ ప‌రిణామం తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు సైతం త‌గ‌ల‌డం ఖాయ‌మంటున్నారు.