Begin typing your search above and press return to search.

టీడీపీ - బీజేపీ ర‌హ‌స్య బంధం!... సాక్ష్యం ఇదిగో!

By:  Tupaki Desk   |   11 Feb 2019 11:10 AM GMT
టీడీపీ - బీజేపీ ర‌హ‌స్య బంధం!... సాక్ష్యం ఇదిగో!
X
గ‌డ‌చిన ఎన్నిక‌ల నాడు క‌లిసే పోటీ చేసిన టీడీపీ - బీజేపీ ఇప్పుడు ప్ర‌త్య‌ర్థుల మాదిరి క‌ల‌రింగ్ ఇస్తున్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో మాట మార్చేసిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు - ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలు ఇప్పుడు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప‌ర‌స్ప‌రం తిట్టిపోసుకుంటున్నారు. అయితే ఇదంతా కేవ‌లం బ‌య‌ట‌కు క‌నిపించే చిత్ర‌మేన‌ని - అయితే లోప‌ల మాత్రం ఈ రెండు పార్టీలు మంచి అవగాహ‌న‌తోనే ముందుకు సాగుతున్నాయ‌ని, ఇంకా ప‌చ్చిగా చెప్పాలంటే ర‌హ‌స్యంగానే కాపురం చేస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ ఆరోప‌ణ‌ల‌కు ఇప్పుడు పెద్ద సాక్ష్యమే దొరికేసింది.

ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిర‌సిస్తూ చంద్ర‌బాబు నేటి ఉద‌యం ఢిల్లీ వేదిక‌గా ఒక్క‌రోజు దీక్ష చేప‌ట్టారు. ఈ దీక్ష‌కు హాజ‌ర‌య్యే నిమిత్తం టీడీపీ నేత‌లు నేటి ఉద‌యం ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ ప్ర‌యాణ‌మ‌య్యారు. ఈ విమానంలో టీడీపీకి చెందిన కీల‌క నేత‌లంతా ఉన్నారు. అయితే వీరి మ‌ధ్య‌లో దిలాసాగా కూర్చున్న బీజేపీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ ఎంపీ కంభంపాటి హ‌రిబాబు కూడా క‌నిపించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ వెళుతున్నామ‌ని చెప్పుకునేందుకు త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో స‌ద‌రు ఫొటోల‌ను పోస్ట్ చేసుకునేందుకు టీడీపీ నేత‌లు త‌మ చేతుల్లోని సెల్ ఫోన్ల‌తో సెల్ఫీలు తీసుకున్నారు. వాటిని అక్క‌డిక‌క్కడే త‌మ అనుచ‌రుల‌కు పంపి... వాటిని సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ అయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్ర‌మంలో ఓ ఫొటోలో టీడీపీ నేత‌ల‌తో పాటు బీజేపీ నేత హ‌రిబాబు ఉన్న విష‌యం కూడా ఇట్టే క‌న‌బ‌డిపోయింది.

ఇంకేముంది.... ఈ విష‌యాన్ని చాలా వేగంగానే ప‌ట్టేసిన వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణునంబాక విజ‌య‌సాయిరెడ్డి దానిపై త‌న‌దైన రీతిలో సెటైర్లు సంధించారు. ఈ ఫొటోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసిన సాయిరెడ్డి... బీజేపీ, టీడీపీల మ‌ధ్య ఇంకా ర‌హ‌స్య కాపురం కొన‌సాగుతూనే ఉందిన సెటైర్ వేశారు. టీడీపీ, బీజేపీల అక్ర‌మ సంబంధానికి ఈ ఫొటో నిద‌ర్శ‌న‌మ‌ని కూడా సాయిరెడ్డి ఓ కామెంట్‌ను జోడించారు. మొత్తంగా ఇప్పుడు ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గానే మారిపోయింది. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు, లోకేశ్ ల‌పై సాయిరెడ్డి విరుచుకుప‌డ్డారు. ధర్మ పోరాట దీక్షల పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబును ప్రజలు గమనిస్తున్నారని ఆయ‌న‌ హెచ్చరించారు. ధర్మపోరాట దీక్షలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చంద్రబాబు రూ.200 కోట్ల ప్రజాధనాన్ని తిరిగి చెల్లించక తప్పదన్నారు.

ఎవరి సొమ్మని పచ్చ కుల మీడియాకు వేల కోట్లు దోచి పెడుతున్నారని మండిపడ్డారు. సొంత పనులకు హెలికాప్టర్‌, విమాన ప్రయాణాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చిరించారు. లోకే శ్ కు... ఇండిపెండెన్స్‌ డేకు రిపబ్లిక్‌ డేకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టినా చంద్రబాబుకూ చిట్టి నాయుడిపై ఏమాత్రం నమ్మకం లేదన్నారు. అందుకే తెలంగాణా ఎన్నికల్లో సరిహద్దు దాటకుండా గీత గీశాడని గుర్తు చేశారు. కానీ దోచుకోవడంలో మాత్రం లోకేశ్ తండ్రి శిక్షణలో రాటు తేలాడని, ఇందులో ఏ గ్రేడ్ ఇవ్వక తప్పదని కూడా సాయిరెడ్డి త‌న‌దైన శైలి సెటైర్లు సంధించారు.