Begin typing your search above and press return to search.

సీఎం జిల్లాకు వస్తే ఎంపీని అరెస్ట్ చేయాలా?

By:  Tupaki Desk   |   11 Jan 2017 4:58 AM GMT
సీఎం జిల్లాకు వస్తే ఎంపీని అరెస్ట్ చేయాలా?
X
రాజకీయంగా విభేదాలు ఉండటం సర్వసాధారణం. అలా అని.. తమ విధానాల్ని వ్యతిరేకిస్తున్న వారి విషయంలో అధికారపక్షం కరకుగా వ్యవహరించటం ఏ మాత్రం మంచిది కాదు. ప్రభుత్వాలు చేసే పనిని వ్యతిరేకించటం ఏమీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్య ఎంత మాత్రం కాదు.ప్రభుత్వవిధానాలు నచ్చకున్నా.. అనుసరిస్తున్న అంశాల్లో ప్రజాప్రయోజనం లేదని నమ్మినప్పుడు.. ప్రజాస్వామ్య బద్ధంగా.. నచ్చిన రీతిలో నిరసన తెలిపే హక్కు నేతలకు ఉంటుంది.

అయితే.. ఇలాంటి నిరసనలు.. ఆందోళనల కారణంగా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసుకుంటే సరిపోతుంది. అయితే.. ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఏపీలో సాగుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కడపజిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయటం స్థానికంగా ఉద్రిక్తతలకు కారణంగా మారింది.

సీఎం పర్యటన సందర్భంగా ఆటంకాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా.. ముందస్తు జాగ్రత్తతో ఎంపీని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ కు తగ్గట్లే.. ఎంపీ తన దృష్టికి వచ్చిన అంశాల్ని ప్రభుత్వానికి చెప్పటం తప్పేం కాదు. కానీ.. శాంతిభద్రతలు.. సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా ముందస్తు అరెస్ట్ చేసినట్లుగా చెప్పటం ఏ మాత్రం సరికాదన్న వాదన వినిపిస్తోంది. సీఎం దృష్టికి సమస్యలు చెప్పుకోవటానికి సిద్ధమైతే..ఈముందస్తు అరెస్ట్ ఏమిటంటూ అవినాష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చర్యలు పోలీసులపై కంటే కూడా.. ప్రభుత్వంపైనా.. ప్రభుత్వాధినేతపైనా ప్రజల్లో మరింత అసంతృప్తి పెంచే వీలుంటుందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమువుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/