Begin typing your search above and press return to search.

వైఎస్సార్ ఎల్పీ నేత‌గా జ‌గ‌న్ ఎన్నిక‌!

By:  Tupaki Desk   |   25 May 2019 7:45 AM GMT
వైఎస్సార్ ఎల్పీ  నేత‌గా జ‌గ‌న్ ఎన్నిక‌!
X
ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆఖండ మెజార్టీతో చారిత్ర‌క గెలుపును సొంతం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఈ రోజు ఉద‌యం తాడేవ‌ల్లిలోని త‌న నివాసంలో పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఎన్నిక‌ల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలంతా ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు.

ఉద‌యం 10.30 గంట‌ల ప్రారంభ‌మైన స‌మావేశంలో పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా జ‌గ‌న్ ను ఎన్నుకుంటూ ఏక‌వాక్య తీర్మానాన్ని చేశారు. పార్టీ ఎమ్మెల్యేలంతా జ‌గ‌న్ ను ఎన్నుకున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు.. ఎంపీలంద‌రూ జ‌గ‌న్ నివాసానికి రావ‌టంతో ఆప్రాంత‌మంతా సంద‌డి సంద‌డిగా మారింది.

ఇదిలా ఉండ‌గా.. మ‌రికాసేప‌ట్లో (ఉద‌యం 11.30 గంట‌ల‌కు) వైఎస్సార్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. అందులో పార్టీ లోక్ స‌భ ప‌క్ష నేత‌ను ఎన్నుకోనున్నారు. ఈ స‌మావేశం ముగిసిన త‌ర్వాత జ‌గ‌న్ మ‌రికొద్ది మంది ఎమ్మెల్యేలు క‌లిసి హైద‌రాబాద్‌కు వెళ్ల‌నున్నారు.

శాస‌న‌స‌భాప‌క్ష‌స‌మావేశంలో చేసిన తీర్మానాన్ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కు స‌మ‌ర్పించ‌నున్నారు.అనంత‌రం ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌కాశం ఇవ్వాల్సిందిగా గ‌వ‌ర్న‌ర్ ను కోరుతారు. మ‌రోవైపు ఈ నెల 30న ప్ర‌మాణ‌స్వీకారాన్ని చేసేందుకు ముమ్మ‌రంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి నాలుగైదు ల‌క్ష‌ల మంది వ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. దీనికి త‌గ్గ‌ట్లుగా ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు.