ఏపీ ఎమ్మెల్యేల పరిస్థితి.. ఆకలిరాజ్యమేనా!

Mon Sep 16 2019 20:00:01 GMT+0530 (IST)

సాపాటు ఎటూ లేదు.. పాటైనా పాడు బ్రదర్.. అంటూ పాడుకుంటున్నారట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. తమ పార్టీ అధినేత అవినీతి రహిత పాలన అంటూ ఎక్కడిక్కడ తమను కట్టడి చేస్తూ ఉంటే.. వారు విస్తుపోతూ ఉన్నారని తెలుస్తోంది. తాము ఎమ్మెల్యేలుగా నెగ్గడం - పార్టీ బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో..వాళ్లు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చినా.. సంపాదించుకునే మార్గాలు మాత్రం మూసుకుపోయాయని వారు వాపోతున్నట్టుగా తెలుస్తోంది.ఏవైనా డీల్స్ చేయాలంటే ముఖ్యమంత్రితో బాధపడుతూ ఉన్నారట వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. జగన్ కేవలం ఒట్టి మాటల మనిషి కాదు చేతల మనిషి. ఎమ్మెల్యేలు ఎవరైనా అవినీతి వ్యవహారాల్లో తలదూర్చారంటే.. జగన్ వారిని పిలిచి మరీ క్లాస్ పీకుతూ ఉన్నారు. అందుకు జగన్ ఎలాంటి మొహమాట పడటం లేదని తెలుస్తోంది.

ఫోన్లు చేసి కొంతమందిని గట్టిగా వాయించారట ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇందుకు సంబంధించి ఆఫ్ ద రికార్డుగా ప్రచారాలు సాగుతూ ఉన్నాయి. ఒక్కసారి అలాంటి డీల్స్ చేస్తున్నారంటే..అలాంటి వారిని జగన్ దగ్గరకు కూడా రానివ్వడం లేదని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ దగ్గర మొహం చూపించుకోవాలనుకుంటే.. అలాంటి లొసుగులు లేకపోవడమే ఉత్తమం అని తేలిపోతోంది.

అందుకే ఎవైనా మార్గాలు కనిపించినా.. ఎమ్మెల్యేలు తటపటాయిస్తూ ఉన్నారట. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి భారీగా ఖర్చు పెట్టుకున్న వాళ్లు.. ఇప్పుడు ఆ డబ్బును రాబట్టుకోవడం ఎలా అనే మీమాంసతో పాటు - వచ్చే ఎన్నికల్లో ఖర్చుకు డబ్బు ఎలా..అనే సందేహంలో కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నట్టుగా  సమాచారం. తమ అవస్థలను గమనించుకుని.. పార్టీ అధికారంలో ఉన్నా తమది ఆకలిరాజ్యమే అని సరదాగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారని తెలుస్తోంది.