Begin typing your search above and press return to search.

బాబుగారి అత్త‌ప్రేమ‌ పై రోజా సెటైర్లు

By:  Tupaki Desk   |   24 Aug 2016 6:12 AM GMT
బాబుగారి  అత్త‌ప్రేమ‌ పై రోజా సెటైర్లు
X
ఏపీలో కృష్ణా పుష్క‌రాలు 12 రోజుల పాటు క‌నివినీ ఎరుగ‌ని రీతిలో జ‌రిగాయి. పుష్క‌రాల కోసం ఏపీ ప్ర‌భుత్వం ఏర్పాట్ల‌న్ని ఎంతో ప‌గ‌డ్బందీగా చేసి ప్ర‌శంస‌లు అందుకుంది. సీఎం చంద్ర‌బాబు సైతం పుష్క‌రాలు జ‌రిగిన 12 రోజులు విజ‌య‌వాడ‌లోనే మ‌కాం వేసి ఏర్పాట్లు ప‌ర్య‌వేక్షించి... భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూశారు. ఇదిలా ఉంటే వైకాపా లేడీ ఫైర్‌ బ్రాండ్‌ - ఆ పార్టీ న‌గ‌రి ఎమ్మెల్యే రోజా పుష్క‌రాల చివ‌రి రోజు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పుణ్య‌స్నానం చేశారు.

రోజా శ్రీశైలం డ్యాం దిగువన లింగాలగట్టు లోలెవల్‌ పుష్కరఘాట్‌ వద్ద పుష్కరస్నానం చేసి కృష్ణవేణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రోజా భర్త సెల్వమణి పితృదేవతలకు పిండప్రదానం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్ర‌త్యేక హోదా రావాల‌ని తాను ఆ దేవుడిని ప్రార్థించిన‌ట్టు తెలిపారు. గోదావ‌రి పుష్క‌రాల‌కు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్నానం చేశామ‌ని..ఇప్పుడు కూడా కృష్ణ‌మ్మ స‌న్నిధిలో కూడా కుటుంబంతో స‌హా పుణ్య‌స్నానాలు ఆచ‌రించిన‌ట్టు ఆమె తెలిపారు.

ఇక శ్రీశైలంలో ఏది కోరుకున్నా జ‌రుగుతుంద‌న్న న‌మ్మకంతోనే తాను ఇక్క‌డ పుష్క‌ర‌స్నానం చేశాన‌ని ఆమె తెలిపారు. ఇక ఏపీ అభివృద్ధి మొత్తం విజ‌య‌వాడ‌లోనే చేస్తున్నార‌ని...అభివృద్ధీ కేంద్రీకృతం కాకుండా చూడాల‌న్నారు. గ‌తంలో హైద‌రాబాద్‌ లో ఇలాగే చేసి న‌ష్ట‌పోయిన విష‌యాన్ని ఆమె గుర్తు చేశారు.

చంద్ర‌బాబుకు అత్త‌గారి మీద‌, అత్త‌గారి ఊరు మీద ఎంత ప్రేమ ఉందో రాజధాని ఏర్పాటుతోనే క్లీయ‌ర్‌ గా తెలిసింద‌ని ఆమె విమ‌ర్శించారు. గోదావ‌రి పుష్క‌రాల్లాగానే - కృష్ణా పుష్క‌రాల‌ను సైతం ప‌బ్లిసిటీ కోసం చేస్తున్నార‌ని...భ‌క్తిభావంతో ఉన్న‌వారు గుడులను ఎందుకు కూల్చుతార‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఇక ప్ర‌భుత్వాల‌తో స్టేట్ డ‌వ‌ల‌ప్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు లేద‌ని అందుకే తాను భ‌గవంతుడిని ప్రార్థిస్తున్న‌ట్టు రోజా తెలిపారు.