Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ పేరు చెప్పుకొంటూ నీచ‌మైన ప‌నులు

By:  Tupaki Desk   |   28 March 2017 6:20 PM GMT
ఎన్టీఆర్ పేరు చెప్పుకొంటూ నీచ‌మైన ప‌నులు
X
తెలుగుదేశం పార్టీ నేత‌ల‌ను పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడైన దివంగ‌త ఎన్టీఆర్‌ కు చెడ్డ‌పేరు తీసుకువ‌చ్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మండిప‌డ్డారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రివర్గంలో అప్పటి విద్యాశాఖమంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు పేపర్‌ లీక్‌ అయితే నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ పేరు చెప్పుకుంటూ తిరుగుతూ అరాచకాలకు పాల్పడుతున్న మంతి నారాయణను భర్తరఫ్‌ చేయాలని చింతల రామచంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. నారాయణ విద్యాసంస్థల్లో ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసకుంటున్నారు వాటిపై విచారణ చేపట్టాలన్నారు. పేపర్‌ లీక్‌ లపై వైయస్‌ ఆర్‌ సీపీ అసెంబ్లీలో వాయిదా తీర్మాణం ఇస్తే దాన్ని చర్చకు రానివ్వకుండా చేయడం దారుణమన్నారు. ప్రతిపక్ష పార్టీగా సభలో విద్యార్థుల భవిష్యత్తుపై చర్చించే బాధ్యత మాపై ఉందన్నారు. పేపర్‌ లీక్‌లపై సమగ్ర విచారణకు ఆదేశించి తల్లిదండ్రులకు పిల్లలకు న్యాయం జరిగే విధంగా చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న మంత్రి నారాయణను వెంటనే రాజీనామా చేయించాలని చింతల రామచంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్ మాట్లాడుతూ కొన్ని లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్తు మీకు ప్రజా సమస్యగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పేపర్‌ లీక్‌లు చేసుకుంటూ లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్న మంత్రి నారాయణను రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామ్స్‌ ఆంధ్రప్రదేశ్‌ నారాయణ హై స్కూల్‌ నుంచి పేపర్‌ లీక్‌ అయ్యిందని స్పష్టంగా చెప్పిందని ఆధారాలతో సహా మీడియాకు చూపించారు. టీడీపీ నేతలు చెబుతున్నట్లు సాక్షి మీడియా ముద్రించిన పేపర్‌ కాదని స్పష్టం చేశారు. సభలో లీకేజీలపై ప్రశ్నిస్తే ప్రజా సమస్య కాదని ప్రభుత్వం మొండివాదన చేస్తోందని దుయ్యబట్టారు. చిన్న చిన్న ఉద్యోగులు సూపర్‌డెంట్, ఇన్విజిలేటర్‌లను సస్పెండ్‌ చేసి తూతూ మంత్రంగా విచారణ జరిపిస్తున్నారని ధ్వజమెత్తారు. కదిరి, అనంతపురం, చిత్తూరు, నెల్లూరులో పేపర్‌ లీక్‌ల వెనుక మంత్రి నారాయణ ఉన్నారని అనిల్ కుమార్ యాద‌వ్ ఆరోపించారు. నారాయణ విద్యా సంస్థల్లో అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఎలాంటి చర్యలు తీసుకోకుండా మంత్రిని కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నారు. వియ్యంకుడే విద్యాశాఖమంత్రి కాబట్టి విద్యాసంస్థలను అడ్డుపెట్టుకొని ఫీజు దోపిడీలు చేస్తున్నా.. ప్రభుత్వం నారాయణ పాటే పాడుతోందని ధ్వజమెత్తారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న నారాయణ యాజమాన్యంపై యాక్షన్‌ తీసుకోవాలని, అదే విధంగా మంత్రి నారాయణను రాజీనామా చేయించాలని అనిల్ కుమార్ యాద‌వ్ డిమాండ్‌ చేశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/