Begin typing your search above and press return to search.

జెండా మోసిన వైసీపీ నేతలు సమిధలేనా?

By:  Tupaki Desk   |   20 Jun 2019 8:40 AM GMT
జెండా మోసిన వైసీపీ నేతలు సమిధలేనా?
X
ఒకే ఒక్క ఫేస్ బుక్ పోస్టు.. ఇప్పుడు వైసీపీలో పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఆది నుంచి వైసీపీని నమ్ముకొని ఉన్న వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తేటతెల్లం చేస్తోంది. ఎవరు చేశారో.. ఎప్పుడు చేశారో తెలియదు కానీ.. అధికారంలోకి వచ్చిన వైసీపీలో క్షేత్రస్థాయి పార్టీ నమ్ముకొని జెండా మోసిన వైసీపీ నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందంటూ ఆ పోస్టులో విశ్లేషణ సాగింది.

‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’ అని మహాకవి శ్రీశ్రీ తన ఆవేదనను వెళ్లగక్కాడు. ఇప్పుడు వైసీపీలో 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండి వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారు కూడా సోషల్ మీడియా సాక్షిగా తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ జెండా మోసినోళ్లను హైజాక్ చేస్తూ నాటి టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సపోర్టుగా రాజకీయం చేసిన వారు ఎంటర్ అవుతున్నారట.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకుంటూ ఏకంగా వైసీపీ క్యాడర్ నే బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఫేస్ బుక్ లో వైరల్ అవుతున్న పోస్టు కలకలం రేపుతోంది.

ఒకటి కాదు.. రెండు కాదు.. జగన్ కోసం జగన్ వెంట.. 10 ఏళ్లుగా కాంగ్రెస్, టీడీపీలను కొచుకొని వైసీపీ క్యాడర్ అష్టకష్టాలు పడింది. ఆర్థికంగా, సామాజికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొని కింది స్థాయి నేతలు, కార్యకర్తలు జెండా మోస్తూ పార్టీని కాపాడుకున్నారు. టీడీపీ ఆదిపత్యాన్ని కాచుకొని ఆస్తులు అమ్ముకున్న వారు కూడా ఉన్నారు. కానీ బెల్లం వెంట ఈగల వలే.. ఇప్పుడు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తూ టీడీపీ నేతలు ఎంటర్ అవుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకుంటున్నారు. నాడు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో సాన్నిహిత్యం నెరిపిన వారు మళ్లీ వైసీపీలోనూ చక్రం తిప్పాలని తగలడ్డారని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే తమ ఆవేదనను ఇలా ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా ఆధారలతో సహా షేర్ చేస్తూ వైసీపీలో కాకరేపుతున్నారు.

తాజాగా వైరల్ అవుతున్న ఫేస్ బుక్ పోస్టు ప్రకారం.. ఏపీలోని చిలకలూరి పేట నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితిని వివరిస్తున్నారు. ఇక్కడ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ప్రత్తిపాటి పుల్లారావు ఓడిపోయారు. వైసీపీ యువనాయకురాలు విడదల రజిని గెలిచారు.. అయితే ప్రత్తిపాటి మంత్రిగా ఉండగా చక్రంతిప్పిన నేత ఒకాయన ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే రజినీని కలిసి ఉండడం.. రాజకీయాలు చేయడం ఆ పోస్టులో ఎత్తి చూపారు.

ప్రత్తిపాటి మంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో సాన్నిహిత్యం నెరిపి నియోజకవర్గంలో అంతా తానై నడిపించిన ఓ టీడీపీ నేత వైసీపీలో చేరారు.. టీడీపీ అధికారంలో ఉండగా.. ప్రత్తిపాటిని బేస్ చేసుకొని నియోజకవర్గంలో అధికారం చెలాయించాడు. టీడీపీలో అధికారం అలవాటు పడిన ప్రాణం కదా.. అందుకే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే రజిని ని కలిసి శాలువ కప్పి వైసీపీలో చేరి మళ్లీ అదే తరహా ఆధిపత్యం చెలాయించడం మొదలు పెట్టాడట.. తొమ్మిదేళ్లుగా వైసీపీ నమ్ముకొని జెండా మోసిన వారిని బెదిరిస్తున్నాడట... నాడు టీడీపీ మంత్రి ప్రత్తిపాటితో ఉన్న ఫొటోను.. నేడు వైసీపీ ఎమ్మెల్యే రజినీతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇలా టీడీపీ హయాంలో ఎమ్మెల్యే, మంత్రుల చాటున అధికారం చెలాయించిన వారిని మళ్లీ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఆదరిస్తున్నారని వైసీపీ క్యాడర్ సోషల్ మీడియా సాక్షిగా ఎలుగెత్తి చాటుతోంది.. వారు వైసీపీలో చేరి ఇలా జెండా మోసిన వైసీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నా.. వారిపై ఆధిపత్యం చెలాయిస్తున్నా మౌనంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల తీరును కింది స్థాయి నేతలు ఎండగడుతున్నారు. అధికారంలోకి వైసీపీ వచ్చినా మళ్లీ టీడీపీ పాత నేతలదేనా అధికారం అని కుమిలిపోతున్నారు.. ఇప్పటికైనా వైసీపీ కోసం జెండా మోసిన వారిని ఆదరించి వారి సరైన ప్రాధాన్యం ఇవ్వాలని వైసీపీ కిందిస్థాయి శ్రేణులు ఇలా సోషల్ మీడియా సాక్షిగా యుద్ధం చేస్తున్నారు.