Begin typing your search above and press return to search.

కాపు యువతను హిప్నటైజ్ చేసి రెచ్చగొడుతున్న పవన్?

By:  Tupaki Desk   |   18 Nov 2018 1:16 PM GMT
కాపు యువతను హిప్నటైజ్ చేసి రెచ్చగొడుతున్న పవన్?
X
కులం లేదు - మతం లేదు అంటూ మాటలు చెబుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేతలు మాత్రం అంతా కులం చుట్టూనే తిరుగుతున్నాయన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయన ఒక సామాజిక వర్గానికి చెందిన యువతను రెచ్చగొడుతూ రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అంతేకాదు.. టీడీపీతో విభేదించి వచ్చినట్లుగా రాష్ట్ర ప్రజల ముందు ప్రొజెక్ట్ చేసుకుంటున్నా ఇప్పటికీ ఆయన టీడీపీ మనిషిగానే మాట్లాడుతున్న వాదనా వినిపిస్తోంది. టీడీపీ నేతలు చెప్పే మాటలే ఇప్పటికే పవన్ చెబుతుండడాన్ని అందుకు ఉదాహరణగా చూపుతున్నారు. తాజాగా పవన్ జగన్‌ పై విమర్శలు చేస్తూ కోడికత్తి అన్న మాట వాడడంతో ఆయన ఇంకా టీడీపీ చేతిలోని మనిషేనన్నది అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

తాజాగా పవన్.. వైసీపీ అధినేత జగన్ కులం గురించి మాట్లాడుతూ విమర్శలు చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. కుల రాజకీయాలకు విరుద్ధమని చెప్పే పవన్‌ కు కులాల ప్రస్తావన ఎందుకని.. కులాల పేరుతో ఆయన ఒక సామాజికవర్గ యువతను హిప్నటైజ్ చేసి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన ప్రసంగాల తీరును చూసిన వారు కూడా ఉద్రేకపరిచేలా.. యువతను హిప్నటైజ్ చేసేలా... లోలోన కులం మత్తు ఎక్కించేలా ఆయన రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాగా జగన్‌ పై పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ నేతలూ స్పందిస్తున్నారు. జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమని వైసీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు. జగన్ కులం గురించి ప్రస్తావిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడుతాడో పవన్ కల్యాణ్ కే తెలియదని ఎద్దేవా చేశారు. పవన్ ఎప్పుడేం చేస్తాడో ఇంట్లోవాళ్లకు కూడా అర్థం కాదని వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలపై పోరాడతానని చెప్పే పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మాని ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం చూస్తే నవ్వొస్తోందన్నారు. పవన్ కల్యాణ్ ఎంత ప్యాకేజీకి అమ్ముడుపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ తన పార్టీని చంద్రబాబుకు గంపగుత్తగా లీజుకు ఇచ్చారని ఆరోపించారు. ఇందుకోసం రియల్టర్ లింగమనేని మధ్యవర్తిత్వం ద్వారా పవన్ మూటలు అందుకున్నారని ఆరోపించారు. పవన్ ఓ సామాజికవర్గానికి చెందిన యువతను రెచ్చగొడుతూ - తన వెంట తిప్పుకుంటూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారని విమర్శించారు. పచ్చ మీడియా చెబుతున్న కోడికత్తి డ్రామా పదాలను పవన్ పలకడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.