అలీ.. వైసీపీకి డ్రెస్ కోడ్ తెచ్చాడబ్బా!

Thu Mar 14 2019 23:04:27 GMT+0530 (IST)

టాలీవుడ్ కమెడియన్ అలీ... నిజంగానే ఏ పని చేసినా ప్రత్యేకంగా ఉంటుందనే చెప్పాలి. ఎప్పుడే 40 ఏళ్ల క్రితం బాలుడిగా ఉన్నప్పుడే సినీ తెరంగేట్రం చేసిన అలీ... తనదైన శైలి కామెడీని పండిస్తూ జనాన్ని నవ్వుల్లో ముంచెత్తుతున్నారు. ఇటీవలే తన సినీ ప్రస్థానానికి సంబంధించి 40 ఏళ్ల వేడుకను ఘనంగా జరుపుకున్న అలీ... ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి అందరికంటే భిన్నంగా వ్యవహరించి వార్తల్లో వ్యక్తిగా నిలిచిన అలీ... ఇటీవలే వైసీపీలో చేరిపోయారు. వైసీపీలో చేరేందుకు వెళ్లిన అలీకి జగన్ నుంచి రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... అలీని తన కుటుంబంలో చేర్చుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలతో అలీలో ఫుల్ జోష్ కనిపించింది. ఆ జోష్ తోనే ఏకంగా అలీ ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు. గురువారం నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లిన అలీ... సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారని చెప్పాలి. నెల్లూరులో జరిగిన కావలి నియోజకవర్గ ముస్లింల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన సందర్భంగా అలీ నిజంగానే అందరి దృష్టికి ఆకర్షించారు. మాట తీరును పక్కనపెడితే... అలీ వేసుకొచ్చిన డ్రెస్ అందరికీ రేకెత్తించిందనే చెప్పాలి. అలీ వేసుకొచ్చిన డ్రెస్‌ను చూసిన వారంతా... ఇదేదో వైసీపీ డ్రెస్ కోడ్ లా ఉందే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైనం కూడా కనిపించింది.

అయినా అలీ వేసుకొచ్చిన డ్రెస్ ఎలా ఉందన్న విషయానికి వస్తే... తెల్ల రంగు చొక్కా వేసుకున్న అలీ... దానిపై ఓ బ్లేజర్ లాంటి చిన్నపాటి కోటును కూడా వేసుకున్నారు. చొక్కా తెలుపు రంగులో సాధారణంగానే ఉన్నా... ఆ బ్లేజర్ మాత్రం చాలా ఆసక్తిగా కనిపించింది. వైసీపీ జెండాలోని రెండు రంగులతో కూడి ఉన్న ఆ బ్లేజర్... జెండాలోని తెలుపు రంగు షర్టుతో కలిసిపోయి... ఏకంగా వైసీపీ జెండానే గుర్తు చేసింది. ఇలా పార్టీ కార్యక్రమానికి హాజరైన తొలిసారే అలీ... వైసీపీ డ్రెస్ కోడ్ లాంటి వస్త్రధారణతో రావడంతో నిజంగానే ఆసక్తిని రేకెత్తించేశారు. వైసీపీ కార్యకర్తలంతా రేపటి నుంచి ఇలాంటి వస్త్రాలనే ధరిస్తే మాత్రం... అది అలీ క్రెడిట్ గానే చెప్పుకోవాలి.