జగన్ పార్టీ రికార్డు..2014లో గెలిచిన అన్ని సీట్లలో విక్టరీ

Thu May 23 2019 16:30:30 GMT+0530 (IST)

ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్ంలోని వైసీపీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో పాటుగా చాలా రికార్డులను తన పేరిట లిఖించుకుందనే చెప్పాలి. ఏ పార్టీ అయినా క్రితం సారి జరిగిన ఎన్నికల్లో గెలిచిన సీట్లన్నింటిలో మరోమారు విజయం సాధించడం దుస్సాధ్యమే. గెలిచిన సీట్లలో దాదాపుగా మెజారిటీ సీట్లలో మళ్లీ ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించినా... ఎక్కడో ఒక చోట కనీసం ఒకటో రెండో సీట్లలో ఓటమిపాలు కావడం సర్వసాధారణమే. అయితే ఈ తరహా పరిస్థితి మాత్రం వైసీపీకి ఎదురు కాలేదు. 2014 ఎన్నికల్లో తాను విజయం సాధించిన 67 స్థానాలన్నింటిలోనూ ఆ పార్టీ ఈ సారి కూడా విజయఢంకా మోగించింది.2014లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించిన మొత్తం 67 సీట్లలో ఈ ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులే గెలిచారు. 2014లో వైసీపీ టికెట్లపై విజయం సాధించిన 67 మంది ఎమ్మెల్యేల్లో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా 23 మందిని లాగేసినా... ఆ సీట్లలోనూ కొత్త అభ్యర్థులను బరిలోకి దింపిన వైసీపీ... ఈ సారి కూడా ఆ 67 స్థానాలను నిలబెట్టుకుంది. ఈ సీట్లతో పాటు మరో 90 సీట్ల మేర కూడా వైసీపీ విజయాన్ని ఖాయం చేసుకుందని కూడా ఎన్నికల ఫలితాల సరళి స్పష్టం చస్తోంది. ఈ లెక్కన క్రితం సారి గెలిచిన సీట్లలో... ఒక్కటంటే ఒక్క సీటును కూడా వైసీపీ కోల్పోలేదన్న మాట. ఈ లెక్కన వైసీపీ రికార్డు సృష్టించినట్టే కదా.