Begin typing your search above and press return to search.

వైజాగ్ ఈ సారి వైసీపీదే

By:  Tupaki Desk   |   16 Jun 2018 8:33 AM GMT
వైజాగ్ ఈ సారి వైసీపీదే
X
ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వ‌స్తే సామాన్యుల‌కు న్యాయం జ‌రుగుతుంది. దేశం అభివృద్దిలో వెలిగిపోతుంది. ఈ దేశం వెన‌క‌బాటుకు కాంగ్రెస్సే కార‌ణం. మోడీతోనే మార్పు సాధ్యం అని 2014 ఎన్నిక‌ల్లో బీజేపీకి ఊహించ‌ని స్థానాల‌లో విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు ప్ర‌జ‌లు. అయితే మోడీ మీద ప్ర‌జ‌లు పెట్టుకున్న ఆశ‌ల‌న్నీ క‌ల్ల‌లు అయ్యాయి. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా విశాఖ‌ప‌ట్నంలో గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ‌ను ఓడించి బీజేపీ నుండి హ‌రిబాబును గెలిపించారు ఓట‌ర్లు.

విశాఖ‌లో ఉత్త‌రాది ఓట‌ర్లు పెద్ద ఎత్తున ఉండ‌డం ఈ గెలుపుకు ఒక కార‌ణం అయితే .. బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డం - దేశ‌వ్యాప్తంగా మోడీ వేవ్ తో పాటు - ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా బీజేపీ - టీడీపీ కూట‌మికి న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ప్ర‌ధాన కార‌ణాలు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీని గెలిపించినా విశాఖ‌కు పెద్ద‌గా ఒరిగిందేమీ లేదు.

ప్ర‌జారాజ్యంలో ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీ‌నివాస్ చిరంజీవితో పాటు కాంగ్రెస్ లో చేరి తెలంగాణ - ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న నేప‌థ్యంలో 2014 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయ్యారు. విశాఖ‌ప‌ట్నం గ‌త నాలుగేళ్లుగా గంటా శ్రీ‌నివాస్ క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తుంది. అక్క‌డ వారు ఆడింది ఆట పాడింది పాట‌. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అన్నింటా అవినీతి. భూక‌బ్జాలు - బెదిరింపులు మొత్తంగా ఇది గంటా ప్రైవేటు సామ్రాజ్యంలా మారిపోయింది. గంటా అక్ర‌మాల‌పై ఎన్ని క‌థ‌నాలు వ‌చ్చినా చంద్ర‌బాబు నాయుడు దానిని అరిక‌ట్టేందుకు తీసుకున్న చ‌ర్య‌లు శూన్యం. గ‌త నాలుగేళ్లుగా ఈ ప‌రిణామాల‌తో ప్ర‌జ‌లు విసిగి వేసారి పోయారు.

మొన్న‌టి దాకా ఏపీ బీజేపీ అధ్య‌క్షుడుగా ఉన్న హ‌రిబాబు మ‌రోసారి విశాఖ ఎంపీగా పోటీ చేసినా గెలిచే అవ‌కాశాలు శూన్యం. బీజేపీ పొత్తుతో టీడీపీ గెలిచి చేసిన అక్ర‌మాల‌కు తోడు మోడీ హ‌వా త‌గ్గిపోవ‌డం - మోడీ మీద ప్ర‌జ‌లు పెట్టుకున్న ఆశ‌లు గ‌ల్లంతు కావ‌డం దీనికి ప్ర‌ధాన కార‌ణం. విశాఖ‌కు కోచ్ ఫ్యాక్ట‌రీ తీసుకురావ‌డంలో హ‌రిబాబు వైఫ‌ల్యం చెందారు. ఇదే స‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు జ‌నం అడుగడుగునా నీరాజ‌నాలు ప‌డుతున్నారు. బాబుతో ఆంధ్ర అభివృద్ది చెందుతుంద‌ని భావించి ఓట్లేస్తే నాలుగేళ్ల‌లో పాల‌న వ్య‌వ‌స్థ పూర్తిగా భ్ర‌ష్టుప‌ట్టిపోయింది. టీడీపీ పాల‌న‌లో అన్ని రంగాల‌లో అవినీతి రాజ్య‌మేలుతుంది. ఈ నేప‌థ్యంలో విశాఖ‌లో వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం ఖాయం. అయితే వైఎస్ విజ‌య‌మ్మ ఈ సారి ఇక్క‌డి నుండే బ‌రిలోకి దిగుతారా ? లేదా ? అస‌లు ఆమె ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా ? లేదా ? అన్న‌ది అంద‌రూ ఆస‌క్తిగా వేచిచూస్తున్నారు.