పదికి పది!... నెల్లూరులో వైసీపీ క్లీన్ స్వీపే!

Thu Mar 14 2019 16:32:32 GMT+0530 (IST)

సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీకి షెడ్యూల్ విడుదలైపోవడం - నోటిఫికేషన్ కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. సంప్రదాయానికి భిన్నంగా అధికార పార్టీ నుంచి కీలక నేతలంతా విపక్షం వైసీపీ వైపు చూస్తున్న వేళ... నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఓ కొత్త మాట బలంగా వినిపిస్తోంది. గడచిన ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం పది అసెంబ్లీల్లో తొమ్మిదింటిలో జెండా పాతేసిన వైసీపీ... ఈ దఫా పదికి పది సీట్లను సాధించేస్తుందన్న మాట గట్టగానే వినిపిస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో సాగిన వేళ... ఈ సారి పదికి పది అంటూ ప్రత్యేకంగా ఫ్లెక్సీలు వెలిసిన విషయం తెలిసిందే.అంతేకాకుండా నాడు వైసీపీ కార్యకర్తలంతా పదికి పది సీట్లు అంటూ చేతుల్లో ప్లకార్డులను పట్టుకుని కూడా నడిచారు. నాటి ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్న జిల్లా ప్రజలు... మారిన సమీకరణాల నేపథ్యంలో నాటి మాట నిజమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చర్చించుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉంటూ... అటు ప్రకాశం జిల్లాతో పాటు ఇటు నెల్లూరు జిల్లాలోనూ చాలా స్థానాల్లో ప్రభావం చూపగలిగిన నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇప్పుడు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న వైనాన్ని గుర్తు చేస్తున్న నెల్లూరు జనం... ఈ దఫా వైసీపీ జిల్లాను క్లీన్ స్వీప్ చేయడం ఖాయమేనని చెబుతున్నారు.

అటు నెల్లూరు తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు కొంతకాలం క్రితం పార్టీలో చేరిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి - ఇప్పుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి చేరిక కూడా వైసీపీకి కలిసివచ్చే అవకాశాలేనని కూడా కొత్త ఈక్వేషన్లను తీస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే రీతిలో మరోమారు రాష్ట్రంలో టీడీపీదే అధికారమంటూ రంగంలోకి దిగిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాటలు గాలి మాటలేనని - ఆయనను కంట్రోల్ చేసుకుంటే టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి కనీసం మర్యాద అయినా దక్కుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తంగా ఇప్పుడు నెల్లూరు రాజకీయం రసవత్తరంగా సాగుతుండగా... టీడీపీ క్లీన్ బౌల్డ్ అవ్వక తప్పదన్న వాదన బలంగా వినిపిస్తోంది.