Begin typing your search above and press return to search.

గుంటూరులో ఇంటికో ఓటు తీసేశారు..

By:  Tupaki Desk   |   26 Oct 2016 9:13 AM GMT
గుంటూరులో ఇంటికో ఓటు తీసేశారు..
X
త్వరలో రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లు - ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే 2019 ఎన్నికలకు ముందే టీడీపీ ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తున్న టీడీపీ అందుకు తగ్గట్టు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేసింది. అభివృద్ధి పనులతో కాకుండా అక్రమ మార్గంలో గెలవడానికి రంగంసిద్ధం చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా గుంటూరు కార్పొరేషన్‌లో ఏకంగా 25 శాతం ఓటర్ల పేర్లను తొలగించడం వివాదాస్పదమవుతోంది. గుంటూరు కార్పొరేషన్లో మొత్తం నాలుగు లక్షల 81వేల 544 ఓట్లు ఉండగా… ఇప్పుడు ఏకంగా లక్షా 22 వేల 223 ఓట్లను తొలగించివేశారు. ఈ విషయం స్వయంగా చంద్రబాబు డ్యాష్ బోర్డులోనే పొందుపరిచారు. అంటే ప్రతి నలుగురిలో ఒకరి ఓటును తీసేసినట్లే. సగటున ఒక కుటుంబంలో నలుగురు ఉంటారనుకుంటే యావరేజ్ న ప్రతి కుటుంబంలో ఒకరి ఓటు పోయినట్లే.

భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించడంతో వైసీపీ నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అయినా, ఎందుకు తొలగించారన్నది అధికారులు చెప్పడం లేదట.. తొలగించిన లక్షా 22 వేల ఓట్లలో వైసీపీ ఓటర్లే అధికారంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న కొన్ని సామాజికవర్గాలను టార్గెట్‌ చేసుకుని ఈ ఓట్లను తొలగించేశారని అనుమానిస్తున్నారు. లక్షా 22 వేల ఓట్లు తొలగింపు ఇలాగే ఉండిపోతే ఫలితాలు తారుమారు అవడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు.

2019 ఎన్నికలకు ముందు కార్పొరేషన్ ఎన్నికలు కీలకం కావడం.. మరోవైపు గుంటూరు రాజధాని ప్రాంత నగరం కావడంతో చాలా కీలకం. అందుకే టీడీపీ అక్కడ ఎలాగైనా గెలవాలనుకుంటోంది. అయితే.. దీని వల్ల నష్టపోతున్న వైసీపీలో స్థానిక నేతలే పోరాటం చేస్తున్నారు. అగ్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఇంతటి సీరియస్ ఇష్యూను పట్టించుకోవాలని గుంటూరు వైసీపీ నేతలు అంటున్నారు. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండడం వల్లే 2014 ఎన్నికల్లోనూ గెలుపు వరకు వచ్చి ఓటమి పాలయ్యామని... ఇప్పుడూ అలాంటి పొరపాట్లు చేయరాదని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/