Begin typing your search above and press return to search.

వైఎస్ ఫోటో తీయించాలా చంద్రబాబు..?

By:  Tupaki Desk   |   28 July 2015 7:01 PM GMT
వైఎస్ ఫోటో తీయించాలా చంద్రబాబు..?
X
రాజకీయ వైరం ఉంటే ఉండొచ్చు. కానీ.. ప్రత్యర్థికి ప్రయోజనం కలిగించే పనుల్ని తెలివైన రాజకీయ నాయకుడు చేయరు. అంతేకాదు.. కొన్ని గీతల్ని దాటే విషయంలో ఆచితూచి వ్యవహరించటం చాలా అవసరం. అధికారంలో ఉన్న సమయంలో తీసుకునే దూకుడు నిర్ణయాలు.. విపక్షంలో ఉన్నప్పుడు వెంటాడి వేధిస్తాయన్న విషయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

విపక్ష నేతగా పదేళ్లు ఉన్న ఆయనకు అలాంటి అనుభవాలెన్నో. తనకు మరోసారి అధికారం దక్కితే.. తాను అధికారంలో ఉన్న సమయంలో చేసిన తప్పుల్ని చేయనని చెప్పుకున్న చంద్రబాబు.. తాజాగా పవర్ లో ఉండి.. గతంలో తాను చేసిన తప్పుల్ని మరోసారి చేయటం గమనార్హం.

తాజాగా ఏపీ అసెంబ్లీలోని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్ర పటాన్ని తొలగించాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీన్ని వైఎస్ కుమారుడి నేతృత్వంలో సాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వరుస ఆందోళనలతో భావోద్వేగాల్ని టచ్ చేసి.. రాజకీయ ప్రయోజనం పొందాలని భావిస్తోంది.

వైఎస్ ఫోటో విషయంలో ఏపీ అధికారపక్షం వాదన ఏమిటంటే..అసెంబ్లీలో స్పీకర్ల ఫోటోలు మాత్రమే ఉన్నాయని.. వైఎస్ ఫోటో పెట్టటం సబబు కాదని.. గతంలో జరిగిన తప్పును తాము సరి చేస్తున్నామని వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ లాంటి జనాదరణ పొందిన నేత ఫోటోను తొలిగించటం కారణంగా చంద్రబాబుకు కలిగే ప్రయోజనం కన్నా.. వాటిల్లే నష్టమే ఎక్కువ.

ఫోటో తీయటంతో.. చంద్రబాబు ఈగో కాస్త సంతృప్తి చెందితే చెంది ఉండొచ్చు.. కానీ.. ఆ పని చేస్తే భవిష్యత్తులో అదో దుష్ట సంప్రదాయానికి నాంది పలికినట్లుగా మారుతుంది. నేటి తరంలో రాజకీయ ప్రమాణాలు రోజురోజుకీ పడిపోతున్న పరిస్థితి. సంప్రదాయం పేరు చెప్పిన చంద్రబాబు.. వైఎస్ ఫోటోను తొలిగించే విషయంలో గట్టిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఫోటో తీసేయటం ద్వారా.. విపక్ష పార్టీకి అధికారపక్షం అవకాశం ఇచ్చినట్లే. వైఎస్ ఫోటో అసెంబ్లీలో ఉంటే వాటిల్లే నష్టమేంటన్న దానికి తెలుగు తమ్ముళ్లు ఎవరూ సూటిగా చెప్పని పరిస్థితి. పెట్టటం వల్ల అధికారపక్షానికి కలిగే నష్టం ఏమిటో అర్థం కాని పరిస్థితి. తాము అధికారంలో ఉన్న ప్రాంతంలో వైఎస్ ఫోటో ఏమిటని బాబు అండ్ కో భావించొచ్చు. కానీ.. ఆ ఫోటో తీయటం వల్ల విపక్ష నేతలు దాన్నో రాజకీయ పరిణామంగా.. కక్ష సాధింపు చర్యగా తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న బాబుకు ఇప్పడు ఇలాంటి పరిణామాలు పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. కానీ.. అధికారం చేజారిన రోజున అంతకంతకూ ఇబ్బందులు పడాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. పవర్ చేతిలో ఉన్న రోజున తీసుకునే నిర్ణయాలు.. తమ చేతి నుంచి పవర్ చేజారిన తర్వాత ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయన్న విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం బాబు అండ్ కో మీద ఉందన్న విషయం మర్చిపోకూడదు.