Begin typing your search above and press return to search.

బుక్ చేయబోయి బుక్ అయిన జగన్ బ్యాచ్

By:  Tupaki Desk   |   3 Sep 2015 5:44 AM GMT
బుక్ చేయబోయి బుక్ అయిన జగన్ బ్యాచ్
X
ఆవేశం ఉండాలి. కానీ.. అందుకు ఆలోచన కూడా ఉండాలి. వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన చోట.. ఆవేశం హద్దులు దాటితే మొదటికే మోసం రావటం ఖాయం. ఆ విషయం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు బాగానే అర్థమై ఉంటుంది. బుధవారం చోటు చేసుకున్న ఘటన చూస్తే.. జగన్ బ్యాచ్ లో హద్దులు దాటే ఆవేశమే తప్పించి.. ఆలోచన చాలా తక్కువన్న భావన కలగటం ఖాయం.

అసెంబ్లీ లాంజ్ లో పెట్టిన వైఎస్ ఫోటోను తీసివేయటం.. దానిపై పలు సందర్భాల్లో ఆందోళన చేయటం తెలిసిందే. వైఎస్ వర్థంతి సందర్భంగా అసెంబ్లీ లాంజ్ లో తీసేసిన వైఎస్ ఫోటో ఉదంతాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తెరపైకి తీసుకొచ్చారు. వర్థంతి సందర్భంగా భావోద్వేగంతో ముడిపడి ఉన్న ఫోటో ఇష్యూను తెరపైకి తీసుకొచ్చారు.

వాస్తవానికి వైఎస్ కు చెందిన చిన్న చిన్న ఫోటోల్ని తీసుకొచ్చి.. వైఎస్ చిత్రపటాన్ని తొలగించిన ప్రాంతంలో పెట్టి నిరసన వ్యక్తం చేయాలనుకున్నది ప్లాన్ గా చెబుతున్నారు. అయితే.. ఫోటోలు చేతబట్టుకొని వచ్చి.. ఆవేశంతో గోడ మీద ఒకరిద్దరు అంటించటంతో (?)పరిస్థితి తారుమారైందని చెబుతున్నారు.

అసెంబ్లీ లాంజ్ లో చోటు చేసుకున్న ఈ ఘటనపై అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సీరియస్ అయినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి పనులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు చెబుతున్నారు. దీంతో అప్పటివరకూ ఆవేశంతో ఏమీ పట్టించుకోని వారు సైతం కంట్రోల్ అయినట్లుగా చెబుతున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన నేతలు కొందరు.. తమ పార్టీ నేతల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టటానికి ఫోటో సెంటిమెంట్ ను వాడుకోవాలని చూసి.. సరైన వ్యూహం లేక అడ్డంగా బుక్ అయ్యామన్న వేదనను వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఇలాంటి తప్పులు జరగకుండా జగన్ బాబు తన బ్యాచ్ ను ఎలా కంట్రోల్ లో పెట్టుకుంటారో..?