Begin typing your search above and press return to search.

ఊరూ వాడా ఏకమై... బై బై బాబు అన్నాయి

By:  Tupaki Desk   |   23 May 2019 12:13 PM GMT
ఊరూ వాడా ఏకమై... బై బై బాబు అన్నాయి
X
చరిత్ర అంటే ఇదిరా అన్నట్టు ఉన్నాయి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. కనీవినీ ఎరుగుని విజయాలతో వైసీపీ దూసుకుపోతోంది. ఏపీలోని 13 జిల్లాలలో రెండింటిలో టీడీపీకీ అక్కౌంట్ ఓపెన్ కాలేదు. దీనిని వైసీపీ కూడా ఊహించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు - జగన్ ఫ్యాన్స్... చివరకు జగన్ కూడా ఊహించని గెలుపు ఇది. 175 స్థానాల్లో 150కి పైగా గెలవడం అంటే మామూలు విషయం కాదు. వైఎస్ జీవితంలో కూడా ఇంతటి విజయం దక్కలేదు. ఎన్టీఆర్ 1983 ప్రభంజనం వంటి గెలుపు ఇది. చిత్రమేంటంటే... ఉమ్మడి రాష్ట్రంలో గవర్నమెంటు ఏర్పాటు చేయడానికి అవసరమైనన్ని సీట్లు 13 జిల్లాల ఏపీలోనే జగన్ సాధించేశాడు. అంటే రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నా కూడా జగన్ ఈ సీట్లతోనే ముఖ్యమంత్రి అయ్యేంతటి పెద్ద గెలుపు ఇది.

150కి పైగా స్థానాలు వచ్చాయంటే అది కేవలం జగన్ పై ప్రేమతో వచ్చిన ఓట్లు మాత్రమే కాదు - చంద్రబాబుకు జనాలు ఇచ్చి షాక్ ట్రీట్ మెంట్. ఆయన తప్పులు ఎంత తీవ్రంగా ఉన్నాయో చెప్పడానికే ఈ స్థాయిలో ఫ్యానుకు ఓట్లు గుద్దేశారు. ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు అయిన నియోజకవర్గాలను జగన్ కొల్లగొట్టారు. గతంలో టీడీపీకి బ్రహ్మరథం పట్టిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి 12-13 సీట్లు జగన్ కి వచ్చే పరిస్థితి ఉంది. జిల్లాలోని 13 సీట్లలోవైసీపీ లీడ్ లో ఉంది. విజయనగరం - కడప జిల్లాలు రెండూ వైసీపీ సొంతం అయ్యాయి. నెల్లూరు కూడా తృటిలో తప్పింది. పశ్చిమగోదావరి జిల్లాలో అన్నీ గెలిస్తే మూడు జిల్లాలలో టీడీపీనీ సమూలంగా నిర్మూలించినట్లే. తెలంగాణలో 2014లో ఎలాంటి ఫలితం కనిపించిందో అలాంటి ఫలితం టీడీపీకి ఇపుడు ఏపీలో కనిపించింది. సాధారణంగా ఎపుడూ అనంతపురంలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి. ఈసారి అక్కడ కూడా టీడీపికి ఒకటో రెండో వచ్చాయి. 2004 వైఎస్ ప్రభంజనంలోనూ తెలుగుదేశం పార్టీకి ఆరు సీట్లు వచ్చాయి. ఈసారి కళ్యాణదుర్గం వంటి కంచుకోటలు కూడా వైసీపీకి దక్కాయి. రాయలసీమ మొత్తం జగన్ గాలే వీస్తోంది.

అక్కడా ఇక్కడా అని కాదు... శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 80 శాతం సీట్లు తక్కువ కాకుండా జగన్ సొంతం చేసుకున్నారు. రాజన్న వారసత్వం - నవరత్నాలు - ప్రభుత్వ వ్యతిరేకత - ఒక్క ఛాన్స్... ఇలా అన్నీ కలిసి జగన్ ని అందలం ఎక్కించాయి. ఇక అమరావతి రాజధాని నిర్మాతగా చరిత్రలో నిలిచిపోవాలన్న చంద్రబాబు కలకు శుభం కార్డు పడింది.