Begin typing your search above and press return to search.

మెజారిటీ ఉంద‌ని మోడీకి అహంకారం: వైసీపీ

By:  Tupaki Desk   |   17 April 2018 12:17 PM GMT
మెజారిటీ ఉంద‌ని మోడీకి అహంకారం: వైసీపీ
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో క్షేత్ర‌స్థాయి పోరాటాల‌తో పాటుగా రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన కార్యాచ‌ర‌ణ‌ను సైతం ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతోంది. ఈ క్ర‌మంలో రాష్ట్రప‌తితో వైసీపీ ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి - వైవీ సుబ్బారెడ్డి - వరప్రసాద్‌ - వైఎస్‌ అవినాష్‌ రెడ్డి - రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు. ఈ సంద‌ర్బంగా రాజీనామా - అందుకు దారితీసిన పరిస్థితులను రాష్ట్రపతికి వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా తాము చేసిన పోరాటాన్ని, ప్రజల ఆకాంక్షలను వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఈ సందర్భంగా రాష్ట్రపతికి వివరించారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పాటు అన్ని అంశాలపై వినతిపత్రం సమర్పించారు.రాష్ట్రప‌తితో భేటీ అనంత‌రం ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు చేసిన ప‌నికి ఏపీ న‌ష్ట‌పోతోంద‌ని ఆరోపించారు. త‌న స్వార్థ‌ ప్ర‌యోజ‌నాల కోసం ఏపీ గురించి బాబు గ‌ళం విప్ప‌లేద‌ని మండిప‌డ్డారు.

ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి అద్భుతమైన రాజధాని నిర్మించి ఇస్తామని తిరుపతి బహిరంగ సభలో నరేంద్రమోడీ మాట ఇచ్చారని ఎంపీ మేక‌పాటి గుర్తు చేశారు. ఈ హామీని ప్రధాని విస్మరించి, ఘోర తప్పిందం చేశారన్నారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, ఎప్పటికైనా సాధించుకుంటామని ఎంపీ మేకపాటి అన్నారు. ఇప్పటికైనా విభజన హామీలు అమలు చేయమని కోరుతున్నామమన్నారు. హామీలు నెరవేర్చకుంటే మోడీ అమలు చేయని వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా మన హక్కు అని, అది ఎప్పటికైనా రావాల్సిందేనని మేకపాటి అన్నారు. ఈ విష‌యంలో ఒత్తిడి చేయాల్సిన బాధ్య‌త బీజేపీ భాగస్వామి అయిన చంద్రబాబుపై కూడా ఉందన్నారు. విభజన సమయంలో ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా - విశాఖ రైల్వే జోన్ - కడప ఉక్కు ఫ్యాక్టరీ తదితర హామీలను నెరవేర్చేలే జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరినట్లు మేకపాటి తెలిపారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. రాజ్యాంగపరంగా తాను ఏం చేయగలనో అవి చేస్తామని రాష్ట్రపతి కోవింద్‌ హామీ ఇచ్చారని మేకపాటి తెలిపారు.

బీజేపీతో వైఎస్ఆర్‌సీపీకి సంబంధాలు ఉన్నాయని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఎంపీ మేక‌పాటి మండిపడ్డారు. మాది సెక్యూలర్‌ పార్టీ అని చెప్పారు. వైఎస్‌ జగన్‌ పై - వైఎస్‌ ఆర్‌ సీపీపై చంద్రబాబు నెపం నెట్టి బురద జల్లుతున్నారన్నారు. తాము స్వతంత్రంగానే పోటీ చేస్తామని, ఎన్నికల తర్వాత ఎవరికి మద్దతివ్వాలి, ఏపీకి ప్రయోజనాలు ఎవరు చేకురుస్తారు.. అనే అంశాలపై తమ మద్దతు ఆధారపడి ఉంటుందని చెప్పారు. రాష్ట్రపతికి తాము అన్ని వివరాలు చెప్పామన్నారు. మోడీకి 272 సీట్లు రావడం ఏపీకి శాపంగా మారిందని మేక‌పాటి వ్యాఖ్యానించారు.

కాగా, ప్రత్యేక హోదా కోసం ఊపిరి ఉన్నంత వరకూ పోరాటం చేస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరినట్లు ఆయన తెలిపారు. ఇక ప్రజల్లోకి వెళతామని, ప్రజల్లోనే ఉంటామని అన్నారు. చిత్తశుద్ధితోనే పదవులకు రాజీనామాలు చేశామని, తమ రాజీనామాలు తప్పనిసరిగా ఆమోదిస్తారని అన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచి కేంద్రంపై మళ్లీ ఒత్తిడి తెస్తామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నారని మేకపాటి విమర్శించారు. ఆయన వైఖరితో ఏపీకి నష్టం వాటిల్లిందన్నారు. నిన్న జరిగిన ఏపీ రాష్ట్ర బంద్‌ విజయవంతమైందన్నారు. బంద్‌తో రాష్ట్ర ప్రజల ఆకాంక్ష వెల్లడైందన్నారు. ఇప్ప‌టి కైనా చంద్ర‌బాబు త‌న ఎంపీల‌తో రాజీనామా చేయించి ఉద్య‌మంలో పాల్గొనాల‌ని ఆయ‌న సూచించారు.