Begin typing your search above and press return to search.

బెజవాడ వెళ్తే.. చంద్రబాబు తుర్రుమన్నట్టేనా?

By:  Tupaki Desk   |   5 Sep 2015 7:09 AM GMT
బెజవాడ వెళ్తే.. చంద్రబాబు తుర్రుమన్నట్టేనా?
X
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రాజధాని కూడా అనాథలాగా ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. అంతమాత్రాన పదేళ్లపాటూ హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా వాడుకోవడానికి కేంద్రం కల్పించిన సదుపాయాన్ని తోసిరాజనవలసిన అవసరం ఉన్నదా? ఒకవైపు హైదరాబాదు నగరం మీద మీకెంత హక్కు ఉన్నదో మాకు కూడా అంతే హక్కు ఉంది? మమ్మల్ని మీరు ప్రశ్నించలేరు.. అని చంద్రబాబు , తెలంగాణ సర్కారుకు సవాళ్లు విసురుతూ ఉంటే సంతోషిస్తున్న ఏపీ ప్రజానీకం.. ఆయన అంతలోనే తట్టా బుట్టా సర్దుకుని బెజవాడకు పాలన తీసుకెళ్లిపోవడానికి ఆత్రుత పడుతోంటే విస్తుపోతున్నారు. ఈ ద్వంద్వవైఖరి ఏమిటా అని ఆశ్చర్యపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఇలాంటి సందేహాలు చాలా కలుగుతున్నాయి. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. మాత్రం దీనిని చంద్రబాబును విమర్శించడానికి వాడుకుంటోంది. పరిపాలనను ఏపీకి తరలించి తీసుకవెళ్లాలనుకుంటున్న నిర్ణయాల్ని.. తమ మీద ఉన్న కేసుల్నుంచి తప్పించుకోవడానికి తుర్రుమంటున్నట్లే అని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

ఒక యాంగిల్‌లో చూసినప్పుడు.. వైకాపా వారు చేస్తున్న విమర్శల్లో కూడా నిజం ఉన్నదనిపిస్తోంది. చంద్రబాబునాయుడు ఒకవైపు హైదరాబాదుపై మాకు హక్కు ఉంది అంటారు. ఏపీకి ప్రత్యేకహోదా అనే పాయింటు కంటె ఎక్కువగా.. హైదరాబాదులో సెక్షన్‌ 8 అమలుకోసం ఎక్కువగా పోరాడుతూ, కేంద్రంతో చర్చలు జరుపుతూ ఉంటారు. అయితే హైదరాబాదులో ప్రస్తుతం వ్యవస్థీకృతంగా ఉన్న కార్యాలయాలను మరికొంత కాలం పాటూ వినియోగించుకుని పరిపాలనసాగించడానికి మాత్రం ఆయన విముఖులు. తక్షణం హైదరాబాదు వదలి విజయవాడకు వెళ్లిపోవాలని, అక్కడ కొత్తగ అద్దెకు భవనాలు తీసుకుని.. ఆఫీసులు నడపాలని ఉత్సాహపడుతుంటారు. అయితే ఈ వైఖరిని వైకాపా వారు తప్పు పడుతున్నారు.

హైదరాబాదులో ఉన్న రోజుల్లో ఫోను సంభాషణల రికార్డింగులు, కాల్‌ డేటా సేకరణ తదితర రూపాల్లో.. ఓటుకు నోటు కేసులో పూర్తిగా ఇరుక్కుపోయినందువల్లే చంద్రబాబునాయుడు నగరం వదలి బెజవాడ వెళ్లిపోవడానికి తొందరపడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చాంద్‌భాషాలు అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విమర్శలు చేయడం విశేషం. ఒకవైపు భాగ్యనగరంపై హక్కులున్నాయని మాట్లాడుతూ.. మరోవైపు రాజధానిని ఆఫీసుల్ని అర్జంటుగా తరలించేయాలని ఆరాటపడినంత కాలం చంద్రబాబుకు ఇలాటి విమర్శలు తప్పకపోవచ్చు.