మరణం ముందు వరకూ పార్టీ ప్రచారంలోనే వివేక!

Fri Mar 15 2019 10:19:11 GMT+0530 (IST)

విధి ఎంత విచిత్రమైంది?   కాలం ఎంత కఠినమైంది?  రోజులో ఎంత మార్పు. మరెంత విషాదం. వైఎస్ కుటుంబానికి ఆశనిపాతంగా మారిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద మరణ వార్తను విన్న వైఎస్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు. సౌమ్యుడిగా పేరున్న ఆయనతో తమకున్న అనుబంధాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తలుచుకుంటున్నారు.తన తమ్ముడు గురించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో  చెప్పిన మాటల్ని పలువురు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆర్భాటాలకు దూరంగా నిరాడంబరంగా ఉంటూ.. సామాన్యులకు అందుబాటులో ఉండే తత్త్వం ఆయనలో ఎక్కువ. గొప్ప మానవతావాది అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తమ సంతాప సందేశాల్లో పేర్కొంటున్నారు.

ఈ రోజు ఉదయం గుండెపోటుతో కాలం చేసిన వివేక.. గురువారం కూడా యాక్టివ్ గానే ఉన్నారు. ఆయన రోజంతా ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. చాపాడు మండలంలో తమతో కలిసి ఎన్నికల ప్రచారంలో హుషారుగా పాల్గొన్న ఆయన.. తెల్లారేసరికి శాశ్వితంగా దూరమయ్యారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లుగా పలువురు జగన్ పార్టీ నేతలు.. అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిన్న వైఎస్ వివేకాతో తాము ప్రచారం చేసినట్లుగా కడప మేయర్ సురేశ్ వెల్లడించారు. అలాంటి ఆయన ఈ రోజున ఇలాంటి వార్తను వినాల్సి రావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. 1981లో తన తండ్రి సమితి ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలోనూ వివేక కూడా సమితి ప్రెసిడెంట్ అని..రాయచోటి ఎమ్మెల్యే గడికోట  శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తమ రెండు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెప్పారు.

2009లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించే విషయంలో వివేక పాత్ర ఎంతో ఉందన్నారు. బాబాయ్ అంటే వైఎస్ జగన్ కు చాలా అభిమానమని.. ఈ విషాద వార్తను తట్టుకునే శక్తిని ఆ కుటుంబానికి భగవంతుడు ప్రసాదించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. వైఎస్ వివేక మరణవార్త విన్న పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలే కాదు.. తెలుగు వారు షాక్ కు గురి అవుతున్నారు.