Begin typing your search above and press return to search.

అనూహ్యంగా వైఎస్ షర్మిల పేరు-అక్కడ పోటీనా?!

By:  Tupaki Desk   |   14 March 2019 5:41 AM GMT
అనూహ్యంగా వైఎస్ షర్మిల పేరు-అక్కడ పోటీనా?!
X
కర్నూలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విషయం ఇప్పటి వరకూ ఒక కొలిక్కి రావడం లేదు. కర్నూలు సీటుకు ముందుగా బీసీ అభ్యర్థిని అనుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. గత ఎన్నికల్లో బీసీకి అవకాశం ఇచ్చి వైఎస్సార్సీపీ ఇక్కడ నెగ్గింది. అయితే అలా గెలిచిన బుట్టా రేణుక పార్టీ తరఫున సరిగా పని చేయలేదు. ఫలితాలు వచ్చిన మొదట్లోనే ఆమె ఫిరాయించే ప్రయత్నం చేశారు.

ఆ తర్వాత కొంత కాలం ఆగారు కానీ.. చివరకు అయితే తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. అలా టీడీపీలో చేరినా… బుట్టా రేణుకకు దక్కుతున్నది ఏమీ లేదు. టీడీపీ తరఫున ఆమెకు ఎంపీ టికెట్ దక్కడం లేదు. ఇక ఎమ్మెల్యే టికెట్ ఆశించినా అది కూడా కష్టమే అని అంటూ ఉన్నారు!

ఇక తెలుగుదేశం పార్టీ ఇక్కడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని రెడీ చేసుకుంది. తమకు అనుకూలంగా లేని నియోజకవర్గంలో కోట్లను చేర్చుకుని టీడీపీ.. బలమైన అభ్యర్థిని రెడీ చేసుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి..ఈ ఎంపీ సీటు పరిధిలో ఏకంగా లక్ష ఓట్లు పొందారు కోట్ల. అయితే ఇప్పుడు ఆయన పార్టీ మారారు.తెలుగుదేశం పార్టీలోకి ఆయన అనుచవర్గం అంతా చేరిందా? అనేది అనుమానమే ప్రస్తుతానికి.

ఇక ఇప్పుడు కోట్లను ఢీ కొట్టడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధీటైన అభ్యర్థి అవసరం అయితే ఉంది. అందుకోసం.. వైసీపీ ఏం చేయబోతోంది అనేది ఆసక్తి దాయకంగా మారింది. ఇన్ని రోజులూ బీవై రామయ్య ఇక్కడ ఇన్ చార్జిగా ఉండే వారు. అయితే ఆయనకు టికెట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. మరో బీసీ అభ్యర్థి నే పరిగణనలోకి తీసుకున్నారని, ఒక డాక్టర్ కు టికెట్ ఖరారు కాబోతోందని ప్రచారం జరుగుతూ ఉంది.

ఆ సంగతలా ఉంటే..అనూహ్యంగా కర్నూలు ఎంపీ సీటు విషయంలో.. వైఎస్ షర్మిల పేరు తెర మీదకు వస్తూ ఉండటం విశేషం. ఆమె గనుక కర్నూలు నుంచి పోటీ చేస్తే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సునాయసంగా విజయం సాధించడంతో పాటు… ఆ సీటు పరిధిలోని అసెంబ్లీ సీట్లలో కూడా వైసీపీలో ఊపు వస్తుందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. మరి నిజంగానే షర్మిల అక్కడ నుంచి పోటీ చేస్తారా? అనేది మాత్రం ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే. ఎల్లుండి ఎలాగూ వైసీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు కాబట్టి.. అప్పుడు పూర్తి స్పష్టత రావొచ్చు!