Begin typing your search above and press return to search.

వై.యెస్.ఆర్ మ‌ర‌ణానికి ముందు ఏం జ‌రిగింది...?

By:  Tupaki Desk   |   2 Sep 2015 12:24 PM GMT
వై.యెస్.ఆర్ మ‌ర‌ణానికి ముందు ఏం జ‌రిగింది...?
X
దివంగ‌త మ‌హానేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌ర్థంతి ఈరోజు. స‌రిగ్గా ఇదే తేదీన ఆయ‌న హెలీకాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. మ‌ర‌ణానికి ముందురోజు ఆయ‌న ఆలోచ‌న‌లేంటి...? ఏం చేశారు...? ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మానికి వెళ్లేందుకు ఎలా సిద్ధ‌మ‌య్యారు..? ఇలాంటి విష‌యాల్నీ వైయ‌స్‌ కు అద‌న‌పు ప్రైవేటు కార్య‌ద‌ర్శిగా ఉన్న భాస్క‌ర‌శ‌ర్మ ఓ వ్యాసంలో రాశారు.

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న అనే కాన్సెప్టునే పూర్తిగా మార్చేయాలని వైయ‌స్ అనుకున్నార‌ట‌. రెండోసారి ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత ప‌ర్య‌ట‌న‌ల తీరుతెన్నుల‌ను మార్చేసి, ప్ర‌జ‌ల‌కు వీలైనంత చేరువ‌య్యే వీలుగా కార్య‌క్ర‌మాలు ఉండాల‌ని కాంక్షించార‌ట‌. ప్ర‌తీ ప‌ర్య‌ట‌న‌లోనూ ప్ర‌జ‌ల‌లో మ‌మేక‌మై మాట్లాడాల‌ని అనుకున్నార‌ట‌. ప‌థ‌కాలు స‌రిగా అందుతున్నాయా లేదా..? ప‌్ర‌భుత్వం నుంచి ఇంకేమైనా ఆశిస్తున్నారా..? ఇళ్ల కేటాయింపులు ఎలా ఉన్నాయి..? పింఛెన్లు, బియ్యం పంపిణీ, రేష‌న్ కార్డులు, విద్యార్థుల వేత‌నాలు... ఇలా అన్నింటికి గురించీ ప్ర‌జ‌ల‌నే నేరుగా అడిగి తెలుసుకోవాల‌ని అనుకున్నారు. అలాగ‌ని దీనికోసం భారీ స‌భ‌లు ఏర్పాటుచేయ‌డం కాదు... ఏ హంగూ ఆర్భాటం లేకుండా ఓ గ్రామానికి వెళ్లి, అక్క‌డ ఓ చెట్టుకింద‌నో, ర‌చ్చ‌బండ‌ద‌గ్గ‌రో ప్ర‌జ‌ల్లో కూర్చుని వారి క‌ష్ట‌సుఖాలను తెలుసుకుని ముచ్చ‌టించాల‌ని ఆయ‌న‌ అనుకున్నార‌ట‌. ఇవ‌న్నీ ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మంలో భాగంగా చేయాల‌నుకున్నారు. రోజుకి రెండూ లేదా మూడు ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని వైయ‌స్ అనుకున్నారు. దాన్లో భాగంగానే తొలి ర‌చ్చ‌బండ సెప్టెంబ‌ర్ 2, 2009న‌... చిత్తూరు, ఉద‌య‌గిరి, కొండెపి నియోజ‌క వ‌ర్గాల్లో ఏర్పాటు జ‌రిగింది.

సెప్టెంబ‌ర్ 2... ఉద‌యం 4.35. శ‌ర్మ‌కు వైయ‌స్ ఫోన్ చేశారు. తాను పర్య‌టించ‌బోతున్న గ్రామాల వివ‌రాల‌ను తెలిపారు. మ‌రో పావుగంట త‌రువాత ఫోన్ చేసి అద‌నంగా మ‌రికొన్ని గ్రామాల పేర్ల‌ను శ‌ర్మ‌కు చెప్పారు. మ‌ళ్లీ 5.40 ప్రాంతంలో శ‌ర్మ‌కి ఫోన్ చేసి... మ‌నం హెలీకాప్ట‌ర్‌లో వెళ్తున్నాం క‌దా. ఎవ‌రెవ‌రు వ‌స్తున్నారూ అని అడిగి తెలుసుకున్నారు. అయితే... ప్ర‌యాణించాల్సిన హెలీకాప్ట‌ర్లో ముగ్గురికి మాత్ర‌మే చోటు ఉంటుంద‌ని కెప్టెన్ ముందుగానే చెప్ప‌డంతో... ముఖ్య‌మంత్రి, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ, సీయ‌స్‌వోలు మాత్ర‌మే వెళ్లారు. ఆ కార్య‌క్ర‌మానికి మంత్రులు గ‌ల్లా అరుణకుమారి, కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, రామ‌చంద్రారెడ్డిలు కూడా రావాల్సి ఉంది. వారిని, విమానంలో బ‌య‌లుదేరి వెళ్లాల్సిందిగా అధికారులు ముందుగానే సూచించారు.

ఉద‌యం 7.50కి క్యాంపు కార్యాల‌యం నుంచి బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకున్నారు వైయ‌స్‌. అక్క‌డ ఉన్న‌తాధికారుల‌తో కాసేపు చ‌ర్చించారు. ఆ త‌రువాత‌... శ‌ర్మ‌తో సెప్టెంబ‌ర్ 12, 13వ తేదీల్లో సోనియాతో అపాయింట్మెంట్ గురించి మాట్లాడారు. ప్ర‌ధాని తిరుమ‌ల ప‌ర్య‌ట‌న గురించి కూడా అడిగారు. ర‌చ్చ‌బండ ఉద్దేశాల గురించి కాసేపు మీడియాతో మాట్లాడారు. హెలీకాప్ట‌ర్‌లోకి ఎక్కుతూ... ‘ఈ ప్ర‌యాణం ఎంత‌సేపు ఉంటుందీ’ అడిగారట‌. రెండు గంటల ఐదు నిమిషాల‌ని శ‌ర్మ చెప్పారు. త‌రువాత హెలీకాప్ట‌ర్ క‌దిలింది.

10.35కి చిత్తూరు ఎస్పీకి శ‌ర్మ ఫోన్ చేశారు. ఆయ‌న హెలీకాప్ట‌ర్ ఇంకా దిగ‌లేద‌న్నారు. ప్ర‌తీ ప‌ది నిమిషాల‌కోసారి ఫోన్ చేస్తూనే ఉన్నారు శ‌ర్మ‌. అదే స‌మాధానం. ప్రకాశం, నెల్లూరు జిల్లాల‌కు చెందిన అధికారులతోనూ ట‌చ్‌లోకి వెళ్లారు. అక్క‌డా అదే స‌మాధానం. స‌మ‌యం గ‌డుస్తున్న కొద్దీ ఆందోళ‌న పెర‌గ‌డంతో విష‌యాన్ని అర‌వింద్‌రావు, జ‌న్న‌త్ హుస్సేస్‌, ర‌మాకాంత్‌రెడ్డిల‌కు తెలిపారు శ‌ర్మ‌. ఆ త‌రువాత‌... జ‌గ‌రకూడ‌ద‌నుకున్న ఘోరం జ‌రిగిపోయింది. రాజ‌శేఖ‌రుడు తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు.

ఈ విష‌యాల‌న్నీ భాస్క‌ర శ‌ర్మ త‌న వ్యాసంలో రాశాను. వైయ‌స్‌ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. భౌతికంగా ఆయ‌న మ‌న మ‌ధ్య లేక‌పోవ‌చ్చు... కానీ, ఆయ‌న్ని త‌ల‌చుకోని రోజంటూ త‌న జీవితంలో ఉండ‌ద‌ని శ‌ర్మ చెప్పారు.