Begin typing your search above and press return to search.

ఆ 17 మ‌ర‌ణాలు సర్కారీ హత్యలే అంటున్న జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   23 April 2017 10:33 AM GMT
ఆ 17 మ‌ర‌ణాలు సర్కారీ హత్యలే అంటున్న జ‌గ‌న్‌
X
చిత్తూరు జిల్లా ఏర్పేడు ఘటనలో 17 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోవ‌డంపై ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏర్పేడు ప్రమాద ఘటనలో కుట్రకోణం ఉందని ఆయ‌న‌ అనుమానం వ్యక్తం చేశారు. అకార‌ణంగా ఆ 17 మంది ఆయువు తీసింది ఇసుక మాఫియానేనని పేర్కొంటూ ఇవి సర్కారీ హత్యలేనని జగన్ స్పష్టం చేశారు. ఏ ఇంటివారిని అడిగినా కదిపినా ఇది హత్యే అని ఆరోపిస్తున్నారని బాధితుల ఆవేదనను జగన్ తెలిపారు. బాధిత కుటుంబాలను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరు నెలల క్రితం కమ్యూనిస్టు నేతలు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్వయంగా 600 లారీలు, ట్రాక్టర్లను జేసీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన పరిస్థితి ఇక్కడ అందరూ చూశారన్నారు. కేవలం ఈ ఒక్క నియోజకవర్గంలో 8 చోట్ల, జిల్లాల్లో మరో 100 చోట్ల ఇసుక మాఫియా రెచ్చిపోతోందని ఆయన మండిపడ్డారు. ఇసుక మాఫియా రెచ్చిపోతున్న సంగతి అధికార యంత్రాగానికి అందరికీ తెలిసిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ పెద్ద‌లు ఉన్నార‌ని ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. ఇసుక మాఫియా వెనుక ఎవరున్నారో ఎందుకు హైలైట్ చేయటం లేదని ప‌లు మీడియా సంస్థ‌ల జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

టీడీపీ నేత‌లు అయిన‌ ధనుంజయ నాయుడు, చిరంజీవి నాయుడు పేర్లను స్థానికులు చెబుతున్నా ఎందుకు అధికారులు పట్టించుకోవటం లేదని జ‌గన్ ప్రశ్నించారు. ఎమ్మార్వో, పోలీసుల దగ్గరకి వెళ్తే పట్టించుకోవటం లేదని ప్రజలు చెబుతున్నారని జగన్ తెలిపారు. ఎమ్మార్వోని కలుద్దామని వెళ్తే.. ఎప్పుడూ అందుబాటులో ఉండటం లేదని సెలవులు పెట్టడమో, ఆఫీసుకు తాళం వేయటమో చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారని జగన్ వెల్ల‌డించారు. పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్తే.. స్టేషన్ గేట్ మూసేసి రావొద్దంటారా అని ఆగ్రహం వ్యక్తం చేసిన జ‌గన్...దీని ఫలితంగా ఇంత మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ధనుంజయ నాయుడు, చిరంజీవి నాయుడుపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని దానికి సమాధానం చెప్పాలన్నారు. కనీసం అధికారులకు, చంద్రబాబు ప్రభుత్వానికి మానవత్వం ఉందా? చిరంజీవి నాయుడు, ధనుంజయ నాయుడులపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు అని జగన్ ప్రశ్నించారు. 10 లక్షలు నష్టపరిహారం చెల్లించి చేతులు దులిపేసుకున్నారని జగన్ మండిప‌డ్డారు. స్వర్ణముఖి నదీతీరాన ఉండి కూడా నీళ్ల కోసం కటకటలాడాల్సిన పరిస్థితికి కారణం ఇసుకు మాఫియేనని జగన్ స్పష్టం చేశారు.

అధికారుల దగ్గర నుంచి మంత్రులు - ముఖ్యమంత్రి - ఆయన కొడుకు దోచుకుంటున్నారని జగన్ ధ్వజమెత్తారు. ఎన్సీఈఆర్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ లో దేశంలో నెంబర్ వన్ అవినీతి రాష్ట్రం ఏపీగా తేల్చిందన్నారు. ఇసుక ఫ్రీ అంటున్న సీఎం చంద్రబాబు నాయుడు వాటి నుంచి డబ్బు సంపాదించుకోవచ్చని నిరూపించారని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఎటు చూసినా ఏది ముట్టుకున్నా.. అంతా అవినీతే అన్నారు. చివరకు పోలవరం ప్రాజెక్టు అంతా దోపిడీయే అయిపోయిందన్నారు. జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలని బాధితులకు ఇప్పటికైనా న్యాయం చేయాలన్నారు. ఒకవేళ ఆపకపోతే ఇంత కన్నా తీవ్రంగా వైయస్ ఆర్సీపీ పోరాటాలతో స్పందిస్తుందని జగన్ హెచ్చరించారు. దయచేసి మీడియా కూడా దీనిపై స్పందించాలని, ఇక్కడ జరుగుతున్న తంతును మీడియా హైలైట్ చేయాలన్నారు. కలిసి వస్తే తప్ప ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఆపలేరన్నారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/