Begin typing your search above and press return to search.

బాబూ.. ఏంటీ ప‌ని - ట్వీట్‌ తో దులిపేసిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   17 May 2018 5:01 PM GMT
బాబూ.. ఏంటీ ప‌ని - ట్వీట్‌ తో దులిపేసిన జ‌గ‌న్‌
X
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన దేవాలయంగా విరాజిల్లుతూ.. కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమ‌ల‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆలయ వ్యవహారాలు సరిగ్గా జరగడం లేదని ఆవేదన చెందిన రమణ దీక్షితులపై 65 ఏళ్లు నిండిపోయాయని చర్య తీసుకోవడానికి చంద్రబాబు సిద్ధ‌మ‌వ‌డంపై జ‌గ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు జ‌గ‌న్ ఓ ట్వీట్ చేశారు. టీటీడీలో అవినీతి - అక్రమాలు - ఆగమశాస్త్ర ఉల్లంఘనలను ప్రశ్నించినందుకు అర్చకులపై కక్ష సాధింపునకు పాల్పడి, వారికి పదవీ విరమణ ప్రకటించడం సరైన నిర్ణయం కాదని అన్నారు. టీడీపీ హయాంలో అన్యాయానికి గురవుతున్న అర్చకులకు ఆయన మద్దతుగా నిలిచారు. తాము అధికారంలోకొస్తే అర్చకులకు రిటైర్మెంట్ లాంటివి లేకుండా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు పలు అంశాలు ప్రస్తావిస్తూ జననేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

‘అవినీతి - అక్రమాలు - ఆగమశాస్త్ర ఉల్లంఘనలను ప్రశ్నించిన కారణంగా టీటీడీ అర్చకులకు పదవీ విరమణ ప్రకటించడం సరైనది కాదు. ప్రధాన అర్చకుడు వెల్లడించిన విషయాలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధనయావ, అధికారదాహం మరోసారి వెల్లడైంది. అనువంశిక సేవకులుగా స్వామివారికి అన్ని కైంకర్యాలు నిర్వర్తించే హక్కు శక్తి ఉన్నంతకాలం ఆ అర్చకులకు ఉంటుంది. పదోన్నతితో కూడిన పే స్కేలు, పదవి వదిలిపెట్టిన తర్వాత ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వనప్పుడు, ఉద్యోగిగా పరిగణించనప్పుడు, వారికి ప్రభుత్వం రిటైర్మెంట్ ప్రకటించడంలో అర్థం లేదు. దేవుని మీద భయం, భక్తి లేనివారు కాబట్టే గుడిభూములను కాజేయాలని చూశారు. ఇప్పుడు ఆలయ అర్చకుల విషయంలోనూ దశాబ్దాలుగా ఏ పాలకుడూ చేయని పని చేస్తున్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వం అధికారంలోకొస్తే దేవాలయాల్లో అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చేస్తాం. ఈ విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను రద్దుచేస్తామని’ వైఎస్ జగన్ తన ట్వీట్‌ ద్వారా ప్ర‌క‌టించారు.