నాయీ బ్రాహ్మణులకు జగన్ భరోసా!

Tue Jun 19 2018 17:56:27 GMT+0530 (IST)

``మీరేం చేస్తారో చేయండయ్యా....నేనేం మాట్లాడను.....ఏయ్ ఇంకొక్కసారి మాట్లాడితే చెబుతున్నా.....మర్యాద కాదు మీకిది....ఎవరిని బెదిరిస్తారయ్యా మీరు ఎవరిని బెదిరిస్తారు....? ఏ ఊరయ్యా మీది....ఏ ఊరు నీది? తొమ్మిదేళ్లు పరిపాలించా....ఒక్కడు రోడ్డు మీదకు రాలా.....న్యాయమైన కోరికలైతే నేనే తీరుస్తా....బెదిరించాలని చూస్తే తోక కత్తిరిస్తా.....గుర్తుపెట్టుకోండి....ఏం న్యాయమైన కోరికలయ్యా...ఏయ్ వాళ్లను ఫ్రీగా వదిలిపెట్టు ఏం చేస్తారో చూస్తాను.....మిమ్మల్ని ఇంతమందిని సచివాలయంలోకి రానివ్వడమే తప్పు... ఉండవయ్యా....నీకు కుటుంబం ఉంటే ఉండవచ్చు...ఏం మాట్లాడుతున్నావు నువ్వు.... తమాషాలాడుతున్నారా....? ఏయ్ వినండయ్యా.....ఆర్గ్యుమెంట్స్ లేవు....ఏయ్ విను...టికెట్టుపై 25 రూపాయలిస్తాం....12 నుంచి 25 రూపాయలు చేశాం...అదే ఎక్కువ.....వెళ్లి విధుల్లో చేరి హ్యాపీగా పని చేసుకోండి.....కనీస వేతనం ఇవ్వమయ్యా.....అది జరగదు...మళ్లీ మళ్లీ చెబుతున్నా....జరగదు....`` అని నాయీ బ్రాహ్మణులపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డ విషయం విదితమే. తమకు కనీసం వేతనం కల్పించాలని విజ్ఞప్తి చేసిన నాయీ బ్రాహ్మణులకు వేలు చూపిస్తూ వీరావేశంతో ఊగిపోతూ చంద్రబాబు చెప్పిన డైలాగులివి.  సచివాలయం సాక్షిగా సీఎంగారు....నాయీ బ్రాహ్మణులపై నిప్పులు చెరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కేశ ఖండన టికెట్టుపై రూ.25 స్వీకరించేందుకు క్షురకులు వ్యతిరేకించడంతో సీఎంగారు వారిపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీరుపై వైసీపీ అధినేత - ఏపీ ప్రతిపక్ష నేత జగన్ స్పందించారు. పవిత్రమైన సచివాలయం సాక్షిగా నాయీ బ్రాహ్మణులతో చంద్రబాబు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. ప్రజలు నాగరికంగా ఉండాలంటే నాయీ బ్రాహ్మణుల సేవలు పొందడం తప్పనిసరంటూ జగన్ ట్వీట్ చేశారు.ముఖ్యమంత్రికి తమ గోడు వెళ్లబోసుకుందామని వచ్చిన ప్రజలను బెదిరించడం గర్హనీయమని  అంతేకాకుండా రూ.25లు చొప్పున ఇస్తానంటూ దేవుడు వరం ఇస్తున్నట్లు చంద్రబాబు చంద్రబాబు హావభావాలున్నాయని జగన్ మండిపడ్డారు. చంద్రబాబులో అహంకార నియంత స్వభావాలు మరోసారి బట్టబయలయ్యాయని చెప్పారు. బీసీలపై చంద్రబాబు కపటప్రేమ మరోసారి బట్టబయలైందని అన్నారు. రద్దీగా ఉన్న రోజు ఒక నాయీ బ్రాహ్మణుడు 10-15 మందికి తలనీలాలు తీస్తారని రద్దీ లేని సమయంలో గుడిని నమ్ముకున్న తమకు న్యాయం చేయమని కోరిన వారిపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధఃగా స్పందిస్తారా అని ప్రశ్నించారు. కనీస వేతనాలు ఇవ్వడం కుదరదంటూ మీడియా సాక్షిగా సీఎం చెప్పడం చట్ట వ్యతిరేకమని జగన్ అన్నారు. దేవుడి దయతో మన ప్రభుత్వం రాగానే నాయీ బ్రాహ్మణుల ముఖంలో చిరునవ్వులు కనిపించేలా కనీస వేతనం ఇస్తానని జగన్ అన్నారు. టీటీడీతోపాటు ప్రతి దేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తానని జగన్ హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు తమను పట్టించుకోకపోయినా....ప్రతిపక్ష నేత జగన్ తమకు అండగా నిలబడడంపై నాయీ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు.