Begin typing your search above and press return to search.

ఏపీ దుస్థితికి 'మేధావి' ప‌వ‌న్ కూడా కార‌ణ‌మే:జ‌గ‌న్

By:  Tupaki Desk   |   23 May 2018 11:22 AM GMT
ఏపీ దుస్థితికి మేధావి ప‌వ‌న్ కూడా కార‌ణ‌మే:జ‌గ‌న్
X

జనసేన అధ్యక్షుడు, సినీన‌టుడు పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విరుచుకుప‌డ్డారు. తనపై ప‌వ‌న్ చేసిన విమర్శలకు జ‌గ‌న్ ఘాటుగా బ‌దులిచ్చారు. ప్ర‌స్తుతం ఏపీ ఉన్న దుస్థితికి ప‌వ‌న్ కూడా కార‌ణ‌మ‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. 2014లో టీడీపీ, బీజేపీల‌కు మ‌ద్ద‌తిచ్చి...ఆ పార్టీల‌ను గెలిపించిన ప‌వ‌న్....ఇపుడు తన స్వార్థం కోసం వాటిని విమ‌ర్శిస్తున్నార‌ని అన్నారు. చంద్రబాబు చేసిన మోసాలు, అన్యాయాలు, అబద్దాల్లో ప‌వ‌న్ కు కూడా భాగస్వామ్యం ఉండి ఉంటుద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప‌వ‌న్ సినిమాలో సినిమా తక్కువ, ఇంటర్వెల్ ఎక్కువ అని ఎద్దేవా చేశారు. మొన్న‌టివ‌ర‌కు టీడీపీ, బీజేపీల‌కు వంత‌పాడిన‌ ప‌వ‌న్ హ‌ఠాత్తుగా వారిపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం హాస్యాస్పద‌మ‌న్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాద‌యాత్ర సంద‌ర్భంగా ఓ విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చిన జ‌గ‌న్....ప‌వ‌న్ పై మండిప‌డ్డారు.

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ప‌వ‌న్.... వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడంపై వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. అదే సంద‌ర్భంగా జ‌గ‌న్ పై ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. వీటికి స్పందించిన జ‌గ‌న్ ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. నాలుగేళ్ల పాటు టీడీపీతో అంట‌కాగిన ప‌వన్ ....ఇపుడు యూట‌ర్న్ తీసుకున్నాడ‌ని అన్నారు. 2014లో పవన్ కళ్యాణ్ అనే మేధావి ....చంద్రబాబు-మోదీల‌కు ఓటేయమని సలహా ఇచ్చారని గుర్తు చేశారు. ఆ ర‌కంగా ప‌వ‌న్ ....రాష్ట్రాన్ని ముంచారని, నేటి రాష్ట్ర దుస్థితికి పవన్ కూడా కార‌ణ‌మ‌ని అన్నారు. ప్రత్యేక హోదా విష‌యంతో పాటు చంద్రబాబు మోసాలు, అన్యాయాల్లో ప‌వ‌న్ కూ భాగస్వామ్యం లేదా అని ప్ర‌శ్నించారు. నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు దగ్గరపడుతున్న నేప‌థ్యంలో త‌న పార్టీ లాభం కోసం ఇదే ప‌వ‌న్ ..... బీజేపీని - చంద్రబాబును విమర్శిస్తున్నారన్నార‌ని మండిప‌డ్డారు.

త‌న‌కు ప‌ద‌వీ కాంక్ష లేద‌ని, ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలాసార్లు నొక్కి వ‌క్కాణించారు. పార్టీ పెట్టి నాలుగేళ్లు గ‌డుస్తున్నా....ఒక‌టీ అరా సంద‌ర్భంలో త‌ప్ప మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీని పెద్ద‌గా విమ‌ర్శించింది లేదు. ఉద్ధానం వంటి స‌మ‌స్య‌ల‌పై చంద్ర‌బాబుతో వ్య‌క్తిగ‌త భేటీలు అవ‌డం త‌ప్ప‌....మీడియా ముఖంగా సీఎం - టీడీపీని విమ‌ర్శించ‌లేదు. కొద్ది రోజుల క్రితం....నుంచి మాత్ర‌మే విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టారు. క‌చ్చితంగా రాబోయే ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే ప‌వ‌న్ ....ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డం, ప్ర‌శ్నించ‌డం మొదలు పెట్టార‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌న‌వ‌స‌రం లేదు. నాలుగేళ్లుగా చంద్ర‌బాబు పాల‌న‌లో క‌న‌ప‌డ‌ని అవినీతి....ఇపుడు హ‌ఠాత్తుగా ప‌వ‌న్ కు ఎలా క‌నిపించింద‌నేది చాలామంది మ‌దిలో మెదులుతోన్న ప్ర‌శ్న‌. త‌న‌కు పద‌వి వ‌ద్ద‌ని అన్న నోటితోనే....ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తాన‌ని....సీఎం చేయాల‌ని ప్ర‌జ‌లను కోర‌డం ప‌వ‌న్ అధికార కాంక్ష‌కు నిద‌ర్శ‌నం. సీఎం అయితేనే ప్ర‌జాసేవ చేస్తారా...అని ప్ర‌శ్నించిన ప‌వ‌న్...ఇపుడు సీఎం ప‌ద‌వి పై ఎందుకు ఆశ‌ప‌డుతున్నారో అర్థం కాని వైనం. రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఉద్దానం స‌మ‌స్య తేల్చ‌కుంటే...నిరాహార దీక్ష చేప‌డతానని ప‌వ‌న్ ప్ర‌క‌టించ‌డం....హాస్యాస్పదం. అంటే ఈ రెండేళ్ల‌పాటు ఆ స‌మ‌స్య తెలిసీ ప‌వ‌న్ మిన్న‌కున్నట్లేన‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏది ఏమైనా ప‌వ‌న్ త‌న‌ను తాను ఎక్కువ‌గా ఊహించుకోవ‌డం ...పక్క‌వారిని చుల‌క‌న‌గా చూడ‌డం మాన‌కుంటే ఇబ్బందులు త‌ప్ప‌వు.