ఆ 40 మందిని సర్కారు చంపేసిందన్న జగన్

Wed May 16 2018 16:33:18 GMT+0530 (IST)

ఒకసారి జరిగితే పొరపాటుగా అనుకోవచ్చు. అయితే.. ఆ పొరపాటు కారణంగా పలువురు మరణిస్తే.. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోసారీ అలాంటిదేదీ చోటు చేసుకోకుండా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ.. బాబు సర్కారు ఈ విషయంలో తప్పుల మీద తప్పులు చేస్తుందన్నట్లుగా వ్యవహరిస్తోంది. తాజాగా గోదావరి నదిలో మునిగిన లాంచీల ఘటనపై ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఏపీ సర్కారు తీరును తీవ్రంగా తప్పు పట్టారు.లాంచీ మునక ఘటన తనను ఎంతగానో బాధ కలిగించిందన్నారు. దాదాపు 40 మంది మరణించారన్న జగన్.. వీటన్నింటిని సర్కార్ హత్యలుగానే పరిగణించాలన్నారు. గతంలో కృష్ణా జిల్లాలో బాబు ఇంటికి కాస్త దూరంలోనే బోటు మునిగిందన్నది మర్చిపోకూడదని జగన్ వ్యాఖ్యానించారు. అప్పట్లో 20 మంది మరణించారని.. ఆ దుర్ఘటన జరిగిన తర్వాత కూడా బాబు సర్కారు చర్యలు చేపట్టలేదన్నారు.

లైసెన్సులు లేకుండా బోట్లను తిప్పుతున్నారని.. నెల వారీగా లంచాలు ఇస్తున్నారని.. అవన్నీ మంత్రులకు అందుతున్నట్లుగా జగన్ ఆరోపించారు. ఈ కారణంగానే ముఖ్యమంత్రి ఈ తరహా ఘటనల విషయంలో స్పందించరన్నారు. ఐదు రోజుల క్రితం ఒక బోటులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని.. ఆ ఘటనలో అదృష్టం బాగుండి ఎవరూ మరణించలేదని.. ఆ ఘటన జరిగిన ఐదు రోజులకే మరో బోటు నీళ్లల్లో మునిగి 40 మంది మృత్యువాత పడ్డారన్నారు.  

మంత్రుల మొదలు చంద్రబాబు వరకూ లంచాలు ముడుతున్నట్లుగా జగన్ ఆరోపించారు. లైసెన్సులు లేకుండా బోట్లను తిప్పుతున్నారని.. వంద బోట్లను కూడా ఏపీ సర్కారు కంట్రోల్ చేయలేకపోతోందన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బయటకు వచ్చే చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తారని.. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే బాగోదంటూ అధికారుల్ని తిట్టినట్లు కలర్ ఇస్తారని.. వాటిని వార్తల రూపంలో ఎల్లో మీడియాలో వేయించుకుంటారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల కారణంగా తాజా మరణాలు చోటు చేసుకున్నాయని.. బాబు మీద హత్య కేసులు నమోదు చేయాలంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

జగన్ వ్యాఖ్యలు ఇలా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బాబు తీరును తప్పు పట్టారు. చంద్రబాబు మెంటల్ బ్యాలెన్స్ మిస్ అయ్యారని.. ఆయన్ను అర్జెంట్ గా మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలన్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు వస్తున్న అద్భుత ప్రజాదరణతో బాబు మైండ్ బ్లాక్ అయ్యిందని.. బాబు బ్యాలెన్స్ మిస్ అయ్యారన్నారు. బాబు మైండ్ సెట్ తీరు సరిగా లేని నేపథ్యంలో ఆయనకు అర్జెంట్‌గా చికిత్స చేయాలన్నారు. లేనిపక్షంలో ఏడాది లోపు రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేస్తారన్నారు.  

నవరత్నాలతో జగన్మోహన్ రెడ్డి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజ్యాన్ని తీసుకొస్తానని జగన్ చెబుతుంటే.. చంద్రబాబు మాత్రం ఒకే ఒక్క ఫేక్ రత్నం ఉందని.. అది పుత్రరత్నం అంటూ ఎద్దేవా చేశారు.