జగన్ డెడ్ లైన్..హోదా ఇవ్వకుంటే ఏప్రిల్ 6న రాజీనామా

Tue Feb 13 2018 18:58:40 GMT+0530 (IST)

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వైఎస్ ఆర్ సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని సంచలన  ప్రకటన చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 86వ రోజు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహిణిని ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదానే సంజీవని అని దాని కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.చంద్రబాబు ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదని బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని జగన్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టగానే చంద్రబాబు డ్రామా మొదలుపెట్టారని మండిపడ్డారు. `గత 12 రోజులుగా జరుగుతున్న డ్రామాను మీరంతా చూశారు. చంద్రబాబుకు సంబంధించిన మంత్రులు కేంద్రంలో ఉన్నారు. వీళ్లు ఆమోదం తెలిపిన తరువాతే బడ్జెట్ కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెడుతుంది. చంద్రబాబు మాత్రం బడ్జెట్ లో తమకు అన్యాయం జరిగిందని డ్రామా మొదలుపెట్టారు. ఇదే చంద్రబాబు జనవరిలో ఏమన్నారు. అన్ని రాష్ట్రాల కంటే మనమే ఎక్కువ సాధించామన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టకముందే చంద్రబాబు అన్న మాటలు ఇవి. ఏ రాష్ట్రానికైనా ఇంత వచ్చిందా అని చంద్రబాబు ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. బడ్జెట్ ప్రవేశపెట్టకముందే చంద్రబాబు కేంద్రాన్ని పొగిడాడు. విభజన చట్టం ప్రకారం మనకు ప్రత్యేక హోదా రావాలి. చంద్రబాబు తన స్వార్థం కోసం - కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదాను అమ్మేశారు. ప్యాకేజీ కంటే హోదాతో జరిగే మేలు ఏంటో అని అడుగుతున్నాడు. దేశంలో సీనియర్ నేత అని చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారు. ప్రత్యేక హోదా మనకు హక్కుగా ఇవ్వాల్సి ఉంది. తన స్వార్థం కోసం ప్యాకేజీకి దాన్ని అమ్ముకున్నారు.`` అని జగన్ విరుచుకుపడ్డారు.

ఈ సందర్బంగా చంద్రబాబు టీంలోని నాయకులపై నాయకుల తీరును సైతం జగన్ తప్పుపట్టారు. `చందద్రబాబు మంత్రి సుజనా చౌదరి ఏమన్నారో తెలుసా? హోదా కంటే ప్యాకేజీనే బాగుంటుందని చెప్పారు. ఇదే పెద్ద మనిషి ఇప్పుడు బడ్జెట్ లో అన్యాయం జరిగిందని డ్రామా ఆడుతున్నారు. ఇవాళ చంద్రబాబు ఏం  అడుగుతున్నారో తెలుసా? మాకు అర్ధరూపాయి ఇస్తామన్నారు. పావలా ఇస్తారని - ప్యాకేజీ ఇవ్వాలని అడుగుతున్నారు. అందుకే..ప్రత్యేక హోదా మా హక్కు అని నినదిస్తూ మార్చి 1న ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం మన ఎమ్మెల్యేలు ధర్నా చేస్తారు. మార్చి3న మన పార్టీ ఎంపీలు నా వద్దకు వస్తారు. వారందరిని కూడా మార్చి5న ఢిల్లీలో ధర్నా చేసేందుకు పంపిస్తాం. మన ఎంపీలు ఎమ్మెల్యేలందరూ ఢిల్లీలో ధర్నా చేస్తారు. మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి. నెలంతా కూడా ప్రత్యేక హోదా కోసం మన ఎంపీలు పోరాటం చేస్తారు. అప్పటికి ప్రత్యేక హోదా రాకపోతే ఏప్రిల్ 6న మన ఎంపీలు రాజీనామా చేసి రాష్ట్రానికి తిరిగి వస్తారు. ఈ పోరాటం ఆగదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతుంది.` అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

నాలుగేళ్ల చంద్రబాబు పాలన మనమంతా చూశామని తెలిపిన జగన్..మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబు చెబుతున్న నేపథ్యంలో ఇవాళ మీరంతా మీ గుండెలపై చేతులు వేసుకొని ఒక్కసారి ఆలోచన చేస్తూ చంద్రబాబు పాలనలో మనలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నామా అని ప్రశ్నించుకోండి అని జగన్ అన్నారు. ఈ వ్యవస్థను మార్చేందుకు విశ్వసనీయత నిజాయితీ తెచ్చేందుకు మీ ముద్దుబిడ్డ బయలు దేరాడు. మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతున్నానని జగన్ తెలిపారు.