జగన్ సిక్కోలు పర్యటనలో అధికారుల నిర్లక్ష్యం

Fri May 19 2017 15:35:02 GMT+0530 (IST)

ప్రోటోకాల్‌కు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. అయితే.. ఏపీ  ప్రతిపక్ష నేత విషయంలో తరచూ నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు అధికారుల మీదన ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. వీటికి బలం చేకూర్చేలా కొన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో  వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలిచేందుకు రెండు రోజుల పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన  విశాఖకు చేరుకొని అక్కడి నుంచి వాహనంలో రణస్థలానికి చేరుకోవాల్సి ఉంది. అయితే.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జగన్ ప్రయాణించాల్సిన బుల్లెట్ ప్రూప్ కారు తాళాల్ని.. కారులోనే మర్చిపోయి లాక్ చేసేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ విపక్ష నేత ఏర్పాట్ల విషయంలో ఇలాంటివి చోటు చేసుకోవటం ఏమిటన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. దీంతో.. మరో వాహనం కోసం శ్రీకాకుళం ఎస్పీకి ఫోన్ చేయటంతో.. హడావుడిగా వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. విశాఖకు చేరుకున్న జగన్.. అక్కడి నుంచి వాహనంలో రణస్థలం చేరుకున్నారు. ఆయనకు ప్రజలు పెద్ద ఎత్తున సాదర స్వాగతం పలికారు.

జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేత వాసిరెడ్డి వరద రామారావు పార్టీలో చేరారు. ఆయన మెడలో పార్టీ కండువా వేసిన జగన్.. సాదర స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉండనున్న జగన్ వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు తెలుసుకోనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/