ఎన్నికల ప్రసంగంలో రామోజీ ప్రస్తావన తెచ్చిన జగన్!

Mon Mar 25 2019 23:41:16 GMT+0530 (IST)

తనకూ కేసీఆర్ కు ముడి పెడుతూ.. కేసీఆర్ ఏపీకి చెందిన వ్యాపార వేత్తలను హైదరాబాద్ లో బెదిరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణపై జగన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ అర్థం లేని ఆరోపణ గురించి స్పందించకుండా ఉండి తెలుగుదేశం వాదనకు అనవసరమైన బలాన్ని చేకూర్చడం కన్నా.. సూటిగా ఆ అంశాన్ని ప్రస్తావించడమే మేలని జగన్ భావించినట్టుగా ఉన్నారు. అందుకే తన ఎన్నికల ప్రచార సభలో తెలుగుదేశం పార్టీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు జగన్. హైదరాబాద్ లో వ్యాపారం చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీ అనుకూలుర ప్రస్తావన తీసుకు వచ్చారు జగన్.ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ‘హైదరాబాద్ లో మనవాళ్లు భారీ ఎత్తున ఉన్నారనే విషయాన్ని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడున్న వారిని ఎవరిని బెదరించారో తెలుగుదేశం పార్టీ వాళ్లే చెప్పాలి. చంద్రబాబు నాయుడే చెప్పాలి. ఈనాడు - ఆంధ్రజ్యోతి - టీవీ ఫైవ్ వాళ్లే చెప్పాలి. వేరే ఎవరినైనా కేసీఆర్ బెదిరించారా? వీళ్లనే బెదిరించారా? ఈనాడు రామోజీరావును బెదిరించారా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను బెదిరించారా?

చంద్రబాబు నాయుడు అక్కడ భారీగా ఆస్తులున్నాయి. ఆయనను బెదిరించారా? రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉన్న మన వాళ్లకు  అపకారం చేసేలా మాట్లాడుతూ ఉన్నారు. ఐదేళ్ల పాలన అనంతరం.. ఫలానా పని చేసినట్టుగా చెప్పి ఓట్లు అడగలేని స్థితిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తన పాలన మీద చర్చ జరిగితే తెలుగుదేశానికి డిపాజిట్లు కూడా రావని తెలుసుకుని.. ఇలా విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లను దండుకోవాలని బాబు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ చంద్రబాబు నాయుడు ఇలాంటి కుట్రలను మరింతగా చేస్తారు..’ అని తాడిపత్రిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ వ్యాఖ్యానించారు.

ఎన్నికల తర్వాత రాష్ట్రానికి ప్రత్యేహోదా సాధనలో తెలంగాణ ఎంపీల సహకారం ఏపీకి మేలు చేస్తుందని - నలభై రెండు మంది ఎంపీలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుందని - ప్రత్యేకహోదా రాష్ట్ర శ్రేయస్సుకు ఉపయోగపడుతుందని జగన్ అన్నారు.