Begin typing your search above and press return to search.

మహా ధర్నాతో మరోసారి జగన్ దూకుడు

By:  Tupaki Desk   |   28 Aug 2016 11:30 AM GMT
మహా ధర్నాతో మరోసారి జగన్ దూకుడు
X
ఏపీ రాజకీయాల్లో ఊపు మొదలైంది. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పోరు మొదలు పెడుతున్నారు. తిరుపతి సభతో మొదలుపెట్టిన ఆయన అన్ని జిల్లాల్లో సభలు నిర్వహించడానికి రెడీ అవుతన్నారు. మరోవైపు ముద్రగడ పద్మనాభం కూడా మరో విడత ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ కూడా రంగంలోకి దూకుతున్నారు. సొంత గడ్డ కడప వేదికగా మహా ధర్నాకు రెడీ అవుతున్నారు.

జగన్ రాయలసీమకు సాగు నీరు లక్ష్యంగా ఉద్యమం మొదలుపెట్టనున్నారు. సెప్టెంబర్ 3న కడప లో భారీగా ధర్నా నిర్వహిస్తున్నట్టు వైసీపీ తాజాగా ప్రకటించడంతో ఆ పార్టీలో కొత్త ఊపు కనిపిస్తోంది. ఈ ధర్నాలో వైఎస్ జగన్ స్వయంగా పాల్గొని రాయలసీమకు సాగునీరు అందించే విషయంలో చంద్రబాబు పక్షపాత వైఖరిని ధర్నాలో ఎండగడుతారని చెబుతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు నీళ్లు విడుదలచేయాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ వద్ద ఈనెల 29న చేయాలని ధర్నా చేయాలని తొలుత నిర్ణయించారు. కానీ ఆ ఆలోచనను మానుకు సెప్టెంబరు 3న ఏకంగా మహా ధర్నా చేయాలని డిసైడయ్యారు.

జగన్ గతంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు దీక్షలు చేపట్టారు. ఫీజుల దీక్ష, జల దీక్ష ఇలా జిల్లాల్లో దీక్షలు, ధర్నాలు చేశారు. తాజాగా మరోసారి రాయలసీమకు నీటి కోసం ఆయన సొంత జిల్లాలో భారీ ధర్నాకు రెడీ అవుతున్నారు. పవన్, ముద్రగడ కూడా యాక్టివ్ అవుతున్న తరుణంలో జగన్ కూడా స్పీడు పెంచుతుండడంతో టీడీపీలో అప్పుడే అందోళన మొదలవుతోంది. అన్ని వైపుల నుంచి ముట్టడి జరుగుతుండడంతో ఇదెక్కడికి దారి తీస్తుందోనన్న చర్చ టీడీపీలో వినిపిస్తోంది. ముద్రగడ, పవన్ కంటే కూడా జగన్ దీక్ష ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుందని భావిస్తున్నారు.