ఒంటివెలగలలో బాబుపై జగన్ నిప్పులు

Sat Aug 12 2017 18:09:54 GMT+0530 (IST)

అర్థమయ్యే మాటలు.. ఆకట్టుకునేలా ప్రసంగం.. సునిశితమైన విమర్శలతో నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెలరేగిపోతున్నారు. ఎన్నికల ప్రచారం అంటే నాలుగు వీధులు తిరిగేసి.. ప్రజలకు చెప్పామంటే చెప్పామన్నట్లు కాకుండా.. నియోజకవర్గం మొత్తాన్ని కవర్ చేస్తున్న జగన్.. బాబు పాలనలోప్రజలకు జరిగిన అన్యాయాల గురించి వివరిస్తున్నారు. ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల లోగుట్టును బయటకు తీస్తూ.. చంద్రబాబు పాలనలోని దుర్మార్గాల్ని బయటపెడుతున్నారు.సార్వత్రిక ఎన్నికల వేళ.. నిరుద్యోగ భృతి.. పేదలకు ఇళ్లు అంటూ హామీలు ఇచ్చి మోసం చేసిన దుర్మార్గ రాజకీయాల్ని విప్పి చెప్పే ప్రయత్నం చేశారు. నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంటివెలగలలో జరిగిన రోడ్డు షోలో జగన్ మాట్లాడారు.

నిప్పులు చెరిగిన జగన్ ప్రసంగంలో ఏమన్నారంటే..

మూడున్నరేళ్లలో ముఖ్యమంత్రి.. టీడీపీకి చెందిన ప్రధాన నేతలు ఎవరూ నంద్యాల వైపు తిరిగి చూడలేదు. అదే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఓట్ల కోసం నంద్యాల వీధుల్లో ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కనిపిస్తున్నారు. రాజకీయ నాయకులు ఎవరైనా సరే.. మాటిచ్చి తప్పితే ప్రజలు వారిని కాలర్ పట్టుకొని అడుగుతారనే భయం కలగాలి. ఎర్రటి ఎండలో రోడ్డు మీదకు వచ్చి ఇక్కడి వారంతా ఎంతో ఆత్మీయతను.. ప్రేమానురాగాలను చూపిస్తున్నారు. అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా.

నంద్యాల ఉప ఎన్నిక ఎందుకు జరుగుతుందో మీకు తెలుసు. గడిచిన మూడున్నరేళ్లలో ఎప్పుడూ జరగనంత హడావుడి నంద్యాలలో జరుగుతోంది. ఎన్నికలు వస్తాయని తెలియక ముందు చంద్రబాబు ఏ రోజైనా నంద్యాలకు వచ్చారా? కనీసం ఆయన మంత్రివర్గంలోని మంత్రులైనా ఇటువైపునకు వచ్చారా? ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ నేతలంతా నంద్యాల రోడ్ల మీద కనిపిస్తున్నారు.

తన అవినీతి సంపాదనతో వందల కోట్ల రూపాయిలతో ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయటానికి చంద్రబాబు వస్తున్నారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తన అభ్యర్థిని బరిలోకి దింపింది కాబట్టి ఈ రోజు చంద్రబాబు కనిపిస్తున్నారే తప్పించి.. ఆయనకు నంద్యాల మీద ప్రత్యేకమైన ప్రేమ అంటూ ఏమీ లేదు. గెలుపు కోసం ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలో పాలన ఎలా ఉందో తెలుసు. మూడున్నరేళ్ల తన పాలనలో చంద్రబాబు తానిచ్చిన హామీల్ని నెరవేర్చింది లేదు. ఏ ఒక్కరికి న్యాయం చేయని చంద్రబాబు పుణ్యమా అని రాష్ట్రంలో పాలన అంటూ ఏమీ లేకుండా పోయింది. ఎన్నికలు వస్తే చాలు.. చంద్రబాబు రైతులకు.. మిగిలిన వర్గాలకు ఇచ్చే హామీలు లెక్కకు మించి ఉంటాయి.

తానిచ్చిన హామీల్ని చంద్రబాబు ఒక్కటైనా నెరవేర్చారా?  వీధుల్లో గోడలపై ప్రకటనలు ఇచ్చారు. తనకు అనువైన మీడియాతో ప్రచారం చేయించి ప్రజల్ని మోసం చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలతో రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు. నేడు మిర్చికి.. శెనగలకు ధరలు లేని దుస్థితి. ఈ విషయాన్ని బాబు ఓట్ల కోసం అడగటానికి వచ్చినప్పుడు ఆయన్ను అడగండి. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్ని ఒక్కటి కూడా నెరవేర్చలేదన్న విషయాన్ని ఆయన్ను ప్రశ్నించండి. రుణమాఫీ జగరలేదెందుకు? అని నిలదీయండి. ఒక్క హామీని అయినా నెరవేర్చారా? అంటూ కాలర్ పుచ్చుకొని ప్రశ్నించండి.

జాబు రావాలంటే బాబు రావాలన్నారు. టీవీలు.. గోడలపైనా ప్రకటనలు ఇచ్చారు. జాబు రాకుంటే నిరుద్యోగ భృతి అన్నారు. ఏపీలోని ప్రతి ఇంటికి బాబు నెలకు రూ.2వేల చొప్పున గడిచిన మూడున్నరేళ్లలో రూ.76 వేలు బాకీ పడ్డారు. ఆ డబ్బు ఇచ్చారా? అని అడుగుతున్నా. నిరుద్యోగుల్నే కాదు.. పొదుపు సంఘాల్ని.. రైతుల్ని.. చదువుకున్న పిల్లల్ని కూడా మోసం చేశాడు. ఎన్నికలప్పుడు అవ్వా.. ప్రతి పేదోడికి ఇల్లు కట్టిస్తానన్నాడు. మూడున్నరేళ్లు అయ్యింది.. ఒక్క ఇల్లు అయినా కట్టించాడా?

ముఖ్యమంత్రి అయ్యాక కర్నూలుకు వచ్చి ఎయిర్ పోర్ట్.. ఉర్దూ యూనివర్సిటీ.. కర్నూలులో స్మార్ట్ సిటీ.. మైనింగ్ స్కూల్.. ఫుడ్ పార్క్.. సిమెంట్ ఫ్యాక్టరీ.. పారిశ్రామిక పార్కులు నిర్మిస్తామని హామీలు ఇచ్చారు. మూడేళ్లు దాటినా ఆయన చెప్పిన దాన్లో ఒక్కటంటే ఒక్కటైనా పూర్తి చేశారా? అని అడుగుతున్నా. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా బాబు మళ్లీ వస్తాడు. ఏదేదో చేస్తామని అంటాడు. అభివృద్ధి చేస్తానని అబద్ధాలు చెబుతాడు. రాజకీయ నాయకులు ఒక మాట ఇచ్చిన తర్వాత.. ఆ మాటను తప్పితే జనాలు కాలర్ పట్టుకొని అడుగుతారనే భయం కలగాలి. నంద్యాలలో నా పార్టీకి ఓటు వేయటం వల్ల నేను ముఖ్యమంత్రిని కాలేకపోవచ్చు. కానీ.. ఏడాది తర్వాత జరిగే కురుక్షేత్ర మహా సంగ్రామానికి ఈ ఎన్నిక నాంది పలకాలి. నంద్యాల అభివృద్ధిని నాకు వదిలేయండి. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తా.

చంద్రబాబు మాదిరి నా ద్గర పదవి లేదు. డబ్బు లేదు. పోలీసులు లేరు. ఆయన చెప్పమన్నట్లు రాసే టీవీ ఛానళ్లు.. పేపర్లు లేవు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే జనాల దగ్గరకు వచ్చే బుద్ధి కూడా లేదు. నాన్నగారు నాకిచ్చిన ఆస్తి ఏమిటో తెలుసా... మీరే. జగన్ అబద్ధం ఆడడు. మోసం చేయడు. మాట ఇస్తే వెనకడుగు వేయడు. చంద్రబాబు దగ్గర ఉన్నవేవీ నాదగ్గర లేవు. ఉన్నవి కాస్తా.. దేవుడి దయ.. మీ అందరి అభిమానమే. రాబోయే రోజుల్లో నోట్ల మూటలతో చంద్రబాబు వస్తాడు. ఓటుకు రూ.5వేలు కుమ్మరిస్తారు. నాకే ఓటు వేయాలని ప్రమాణం చేయించుకుంటాడు. వారు అలా వచ్చి చెప్పినప్పుడు మీరు లౌక్యం ప్రదర్శించాలి. న్యాయమే గెలవాలని మనసులో అనుకోవాలి. న్యాయానికే ఓటు వేయాలని అనుకోండి. ధర్మానికి.. అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో న్యాయం వైపు నిలవండి.