జగన్ పిలుపు : ఇది యుద్ధం.. కావాలి సన్నద్ధం!

Wed Oct 11 2017 21:25:37 GMT+0530 (IST)

అక్టోబరు 2వ తేదీనుంచి చేపట్టబోతున్న పాదయాత్రను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి అవినీతి మీద ప్రజావ్యతిరేక ప్రభుత్వం మీద యుద్ధంగా అభివర్ణించారు. పార్టీకి చెందిన రాష్ట్రంలోని అందరు సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు జిల్లా శాఖల నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జిలు అందరితోనూ జగన్ బుధవారం లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పాదయాత్ర గురించి కూలంకషంగా అందరితోనూ చర్చించారు. పాదయాత్ర జరగాల్సిన తీరుతెన్నులు.. ప్రజల నుంచి మంచి స్పందన రాబట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు.. ప్రభుత్వం దుర్మార్గాలను ఎండగట్టడానికి ప్రజలకు విపులంగా తెలియజెప్పడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా అన్ని అంశాలగురించి జగన్మోహన్ రెడ్డి నాయకులతో చర్చించారు.సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో.. పాదయాత్ర కు సంబంధించి.. అందరూ తమ తమ సూచనలు తెలియజేయాల్సిందిగా కోరడం మాత్రమే కాకుండా ఇన్ఛార్జిలు వెల్లడించిన అభిప్రాయాలను జగన్ స్వయంగా నోట్ చేసుకుంటూ వాటి మీద చర్చిస్తూ ఒక ప్రణాళిక ప్రకారం సమావేశాన్ని నిర్వహించడం విశేషం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో ఈ పాదయాత్ర అనే ఘట్టం చాలా కీలకమైనదిగా జగన్ పేర్కొన్నారు. మూడున్నరేళ్ల దుర్మార్గపు పాలనను ప్రజలకు అర్థమయ్యేలా తెలియజెప్పడానికి మంచి అవకాశంగా దీనిని పేర్కొన్నారు. ఆరునెలల వ్యవధిలో 3వేల కిలోమీటర్ల పొడవున యాత్ర సాగనున్న సంగతి తెలిసిందే. రూట్ మ్యాప్ ప్రకారం మొత్తం 120 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగనున్న యాత్ర మీద ప్రజల్లో కూడా చాలా ఆశలున్నాయనే అభిప్రాయాలు సమావేశంలో వ్యక్తం అయ్యాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ప్రజల్ని ఎలాంటి సమస్యలు గురిచేస్తున్నదో వాస్తవంగా ప్రజల బాధల్ని ఎలా విస్మరిస్తున్నదో అనేక అంశాలు ఆయన దృష్టికి వచ్చాయని వాటి ఆధారంగా ఆయన ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసుకుని ప్రజల మనసుల్ని గెలుచుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే తరహాలో.. క్షేత్రస్థాయిలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెలుసుకోడానికి దానికి పరిష్కారాల్ని కనుగొనడానికి జగన్ కు ఈ యాత్ర ఎంతో ఉపకరిస్తుందని సమావేశంలో నాయకులు అభిప్రాయపడ్డారు.

పాదయాత్ర నేపథ్యంలోనే బూత్ స్థాయినుంచి కూడా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగన్ పిలుపు ఇచ్చారు. ఈ పాదయాత్రతో చంద్రబాబు ప్రభుత్వపు పునాదులు కదులుతాయని ఆయన చెప్పారు. ఈసారి ఎన్నికలు గడువు కంటె ముందే వచ్చే అవకాశం ఉన్నదని... ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే.. సమర్థంగా ఎదుర్కొనడానికి యుద్ధంలోని సైనికుల్లా విజయంకోసం పోరాడడానికి అందరూ ఏమరుపాటు లేకుండా సన్నద్ధం కావాలని జగన్ పిలుపు ఇచ్చారు.