బాబు పార్టనర్ పవన్ : జగన్ డైరెక్ట్ ఎటాక్!

Sun Feb 18 2018 22:49:42 GMT+0530 (IST)

ముసుగులో గుద్దులాటలు ఇక ముగిసిపోయినట్టే! జగన్మోహన్ రెడ్డి అంటే తనకు ద్వేషం లేదని అవసరమైతే ఆయనతో కలసి పనిచేయడానికైనా సిద్ధమే అని  సన్నాయి నొక్కులు నొక్కుతూనే.. ‘పవన్ మనోడే’ అన్న సీఎం మాటలని ఖండించకుండానే.. చంద్రబాబును సేవ్ చేయడానికి మాత్రమే  పనిచేస్తున్నట్లుగా ఉన్న పవన్ కల్యాణ్ విషయంలో ఇన్నాళ్లూ జగన్మోహన్ రెడ్డి ఒకింత ఉపేక్ష పాటించారని అనుకోవాలి. అయితే ఈ ఆదివారం నాటితో అలాంటి మొహమాటాలకు కాలం చెల్లిపోయింది. ఒకవైపు వైకాపా కు అయినా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలనే సవాలను ఘనంగా స్వీకరించి.. అవిశ్వాసానికి కూడా టైంషెడ్యూలు ప్రకటించిన జగన్.. అదే సమయంలో  పవన్ కల్యాణ్ మీద డైరెక్ట్ ఎటాక్ ప్రారంభించారు.‘చంద్రబాబు పార్టనర్ పవన్ కల్యాణ్ కు ఇదే చెబుతున్నా..’ అంటూ ఆయన వారిద్దరి అక్రమ సంబంధాన్ని సూటిగా ప్రశ్నిస్తూ.. తన ఎటాక్ ప్రారంభించారు. అవిశ్వాసం పెట్టడానికి తాము సిద్ధంగానే ఉన్నాం  అని అంటూనే.. రాష్ట్ర ప్రజలని మాయ మాటలతో మోసం చేయవద్దని వారిద్దరికీ విజ్ఞప్తి చేస్తున్నా అంటూ.. జగన్ వారి వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేశారు. పవన్ కు జగన్ డైరెక్ట్ ప్రపోజల్ పెట్టారు.. అవిశ్వాసం పెట్టడానికి మేం సిద్ధంగా ఉన్నాం.. కానీ మా బలం చాలదు. అవిశ్వాసానికి 54 మంది సభ్యుల మద్దతు కావాలి.. తెదేపా కూడా మా పార్టీనుంచి తమలో కలుపుకున్న ఫిరాయింపు ఎంపీలతో సహా.. అవిశ్వాసానికి మద్దతివ్వడానికి ముందుకు వస్తుందో లేదో పవన్ అడిగి తెలుసుకోవాలి అని.. జగన్ సూటిగా తన సవాలును సంధించారు.

బహుశా.. అవిశ్వాసం ప్రతిపాదన అనే ఐడియాను ఎందుకు ప్రతిపాదించామా? అని పవన్ కల్యాణ్ ఇప్పుడు మధన పడుతుండవచ్చు. దానివల్ల అనవసరంగా నిందలు తనమీదికే మళ్లడం ఆయనకు చికాకు కలిగించవచ్చు. కానీ.. తాను తెలుగుదేశానికి అనుకూలంగా మాత్రమే  ప్రతి పనిని చేయడం లేదని.. తనకు కూడా సొంత వ్యక్తిత్వం ఉన్నదని నిరూపించుకోవాలంటే.. జగన్ ఇచ్చిన ప్రతిపాదన ఒక్కటే సరైనదని.. ఆయన అవిశ్వాసానికి మద్దతు ఇచ్చేలా చంద్రబాబును ఒప్పించాలి. లేదా చంద్రబాబు నాటకాలు ఆడుతున్నట్లుగా తాను స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుందని.. విశ్లేషకులు భావిస్తున్నారు.