Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ బీసీ డిక్ల‌రేషన్ - ఓ పొలిటిక‌ల్ సెన్సేష‌న్

By:  Tupaki Desk   |   17 Feb 2019 3:37 PM GMT
జ‌గ‌న్ బీసీ డిక్ల‌రేషన్ - ఓ పొలిటిక‌ల్ సెన్సేష‌న్
X
సామాజికంగా వెనుకబడిన బీసీ వర్గాలపై వారి అభ్యున్నతి, సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. బీసీల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది బడ్జెట్‌లో రూ. 15 వేల కోట్లు రూపాయలు కేటాస్తాయిమని, ఐదేళ్లలో రూ. 75వేల కోట్లు బీసీలకు అందిస్తామని వైఎస్‌ జగన్‌ చరిత్రాత్మక ప్రకటన చేశారు. బీసీలకు ప్రతి ఏడాది రూ. 10వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. గత ఐదేళ్లలో రూ. 60వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా.. కేవలం రూ. 18 వేల కోట్లు మాత్రమే కేటాయించారని గుర్తు చేశారు.

ఏలూరులో ఆదివారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన భారీ సభ బీసీ గర్జనలో ఆయన బీసీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తూ... పలు కీలక ప్రకటనలు చేశారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని, తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే సమగ్ర బీసీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తీసుకొస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. బీసీ వర్గాల్లోని అన్ని కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని, బీసీల్లోని 139 కులాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ మహిళకు వైఎస్సార్‌ చేయూత కింద రూ. 75 వేలు ప్రతి ఏడాది నేరుగా అందజేస్తామని ప్రకటించారు. గ్రామ వాలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వైఎస్సార్‌ చేయూత కింద డబ్బును పంపిణీ చేస్తారని వెల్లడించారు.
‘పేదవాడి సంక్షేమం కోసం దివంగత నేత, నాన్న వైఎస్సార్‌ ఒక్క అడుగు ముందుకువేస్తే.. నేను రెండు అడుగులు ముందుకేస్తాను. మీ పిల్లలను కలెక్టర్‌, డాక్టర్‌, ఇంజినీర్‌ ఏదైనా చదివించండి. ఎన్ని లక్షలు ఖర్చైనా ఉచితంగా చదివిస్తాం. హాస్టల్‌లో ఉండి చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 20వేలు ఇస్తాం. పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి ఏటా రూ. 15వేలు ఇస్తాం’ అని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.

బీసీ కమిషన్‌ పనిచేసేలా చట్టబద్ధత కల్పిస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. కులం సర్టిఫికెట్లు, గ్రూపుల మార్పిడి, ఎంబీసీలతోపాటు బీసీల సమస్యలు పరిష్కరించేందుకు బీసీ కమిషన్‌ పనిచేస్తుందని తెలిపారు. బీసీ ఉపకులాల్లో ఉన్న డిమాండ్లను వారి ఆకాంక్షలకు అనుగుణంగా బీసీ కమిషన్‌ ద్వారా పరిష్కరిస్తామని చెప్పారు. ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం ధర్మం కాదని అన్నారు. రాష్ట్రంలోని 31 బీసీ కులాలు కేంద్రం పరిధిలోని ఓబీసీ జాబితాలో లేవని, అయినా నాలుగున్నరేళ్లు కేంద్రంలో బీజేపీతో సంసారం చేసిన చంద్రబాబు ఈ కులాల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి 32 కులాలను బీసీ జాబితాలో చేర్పిస్తామని వెల్లడించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగాల్లో 50శాతం ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వచ్చేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందజేసి.. రూ. 10వేల వరకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని ప్రకటించారు. షాపులున్న ప్రతి నాయి బ్రాహ్మణులకు ఉచితంగా ఏడాదికి రూ. 10 వేలు ఇస్తామన్నారు. సంచార జాతులకు ఉచితంగా ఇల్లు, ఉపాధి కల్పిస్తామని, వారి పిల్లల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 10వేలు ఇస్తామని, ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారులకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తామన్నారు. మత్స్యాకారులకు ఇచ్చే డీజిల్‌పై సబ్సిడీ పెంచుతామన్నారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత మహిళకు ప్రతి నెలా రూ.2 వేలిస్తామని హామీ ఇచ్చారు. సహకార డెయిరీకి పాలు పోస్తే లీటర్‌కు రూ.4 అదనంగా చెల్లిస్తామన్నారు. ప్రధాన ఆలయాల్లో నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం అందజేస్తామన్నారు. ఆలయాల్లో బోర్డు మెంబర్లుగా నాయి బ్రాహ్మణులు, యాదవులకు చోటు కల్పిస్తామని తెలిపారు. పేదవాడు ప్రమాదవశాత్తు చనిపోతే వైఎస్‌ఆర్‌ బీమా కింద రూ.7లక్షలు అందజేస్తామన్నారు. అప్పుల వాళ్లు ఆ కుటుంబాన్ని వేధించకుండా అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు. ప్రభుత్వం ఆడపడుచుకు ఇచ్చిన కట్నంగా ఆ డబ్బును అందిస్తామన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, తాము చేసిన మంచి పనులు చెప్పుకుని ఐదేళ్ల తర్వాత మళ్లీ ఓటు అడుగుతామని వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

బీసీలకు ప్ర‌క‌టించిన వ‌రాలివే

1. బీసీ కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి 15000 కోట్లు

2. 5సంవత్సరాలలో రూ.75000 కోట్లు

3. తొలి అసెంబ్లీలోనే సబ్ ప్లాన్ చట్టం తీసుకొస్తాం

4. బీసీ ఉప కులస్తులందరికి 139కార్పోషన్లు ఏర్పాటు చేస్తాం.

5. 45౼60 వయసున్న ప్రతి అక్కకు 5సంవత్సరానికి రూ.75000 వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఉచితంగా అందింస్తాం.

6. బీసీ విద్యార్థుల చదువులకు ఎన్నిలక్షలు ఖర్చయినా భరిస్తాము.. బీసీ విద్యార్థుల హాస్టల్ ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి ₹20,000 ఇస్తాము..

7. మీ పిల్లలను బడులకు పంపండి, ప్రతి అక్కకు ₹15000 ఇస్తాము.

8. శాశ్వత పద్దతిన బీసీ కమీషన్ ను చట్టబద్దంగా ఏర్పాటుచేస్తాం.

9. బడ్జెట్ లో మూడవవంతు బీసీ లకు ఖర్చు చేస్తుంది.

10. కాంట్రాక్టు సర్వీసుల్లో ఎక్కడైనా 50% పనులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల‌కు వచ్చేట్లు చేస్తాం.

11. చిరువ్యాపారులకు పెట్టబడులకోసం కులవృత్తి చేసుకునే ప్రతిఒక్కరికి ఐడీ కార్డు ఇచ్చి, ప్రతి ఒక్కరికి సున్నా వడ్డికే రూ.10000 ఇస్తాము.

12. రాజకీయ ఎదుగుదల కోసం ఏ రాజకీయ పదవుల్లోనైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల‌కు 50% రిజర్వేషన్ ఇస్తాం. ప్రత్యేక చట్టం కూడా తీసుకువస్తాం..

13. నాయీ బ్రాహ్మనునికి ప్రతి షాపుకి సంవత్సరానికి ₹10000 ఇస్తాం

14. సంచార జాతులకు స్థిరనివాసం,, తగిన ఉపాది,, గురుకుల పాఠశాలలు నిర్మిస్తాం.

15. మత్యకారులకు వేట నిషేదసమయంలో ₹10000 ఇస్తాం.

16. మత్యకారులకు భీమా వేటసమయంలో 10లక్షల భీమా..

17. కొత్తబోట్లు కొనుగోలుకు, డీజీల్ కు సబ్సీడీ..

18. చేనేత అక్కచెల్లెమ్మలకు ఇంట్లో మగ్గం వున్నవారికి నెలకు ₹2000..

19. యాదవులకు గొర్రెలు మేకలు చనిపోతే ₹6000 ఇన్సూరెన్స్..

20. సన్నిది గొల్లలకు వారసత్వ హక్కులు కల్పిస్తాం.

21. ప్రదాన ఆలయాలలో యాదవులు నాయిబ్రాహ్మలకు ట్రస్టుబోర్డు పదవులు.

22. రైతన్నలు చనిపోతే, ఆత్మహత్య చేసుకున్న కులం ఎవరైనాసరే వైఎస్సార్ భీమా ద్వారా 7లక్షలు ఇస్తాం. బలవంతపు వసూలు చేయకుండా చట్టం తీసుకువస్తాం.

23. బీసీ అంటే బ్యాక్వార్డు క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ గా తీసుకువస్తాం.

24. సహకార డైరీలకు పాలు పోస్తే లీటరుకు ₹4 సబ్సీడీ ఇస్తాం.