Begin typing your search above and press return to search.

సింగిల్ క్లిక్ తో..ఇంటి వ‌ద్ద‌కే ఇసుక‌

By:  Tupaki Desk   |   24 Jun 2019 10:00 AM GMT
సింగిల్ క్లిక్ తో..ఇంటి వ‌ద్ద‌కే ఇసుక‌
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ కు నూత‌న ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... పాల‌న‌లో త‌న‌దైన ముద్ర వేస్తున్నారు. అవినీతిపై ఇప్ప‌టికే త‌న‌దైన యుద్ధాన్ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌.. టీడీపీ హ‌యాంలో ఆ పార్టీ నేత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించిన ఇసుక అక్ర‌మ రవాణాకు చెక్ పెట్టిన జ‌గ‌న్‌... రాష్ట్రంలో స‌రికొత్త ఇసుక పాల‌సీని రూపొందించారు. ఇప్ప‌టికే త‌న వ‌ద్దకు ప‌రిశీల‌న కోసం వచ్చిన ఈ పాల‌సీని జ‌గ‌న్ ఆమోదించ‌డం - ఆ త‌ర్వాత కేబినెట్ ఆమోద ముద్ర ప‌డ‌ట‌మే త‌రువాయి.. ఈ పాల‌సీ అమ‌ల్లోకి రానుంది. ఈ పాల‌సీ అమ‌ల్లోకి వ‌స్తే... ఇక‌పై ఇసుక కోసం రోజుల త‌ర‌బ‌డి వేచి చూడాల్సిన ప‌నిలేదు. శ‌క్తికి మించిన సొమ్మును వెచ్చించ‌నూ అక్క‌ర్లేదు. కేవ‌లం ఒకే ఒక్క క్లిక్ తో ఇసుక ఇంటి వ‌ద్ద‌కే వ‌చ్చి చేరుతుంది. అది కూదా అత్యంత త‌క్కువ ధ‌ర‌కే.

ఈ మేర‌కు జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌తిపాదించిన ఇసుక పాల‌సీపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. ఈ విధానం అమ‌ల్లోకి వ‌స్తే...రాష్ట్రంలోని ఇసుక రీచ్ ల‌న్నీ రాష్ట్ర ఖ‌నిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప‌రిధిలోకి వ‌చ్చేస్తాయి. చిన్న న‌దులు, వాగులు - వంక‌ల్లోని ఇసుక‌ను జ‌నం ఉచితంగానే త‌ర‌లించేసుకోవ‌చ్చు. ఇందుకోసం సింగిల్ రూపాయి కూడా చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ఇక కృష్ణా - గోదావ‌రి - పెన్నా - తుంగ‌భ‌ద్ర వంటి న‌దీ తీరాల్లోని ఇసుక రీచ్ ల‌న్నీ ఏపీఎండీసీ ప‌రిధిలోకి వెళ‌తాయి. ఇక్క‌డి ఇసుక కావాల‌నుకునే వారు.... ఏపీఎండీసీ వెబ్ పోర్ట‌ల్ ను సంద‌ర్శించి త‌మకు ఎంత‌మేర ఇసుక కావాల‌న్న వివ‌రాల‌ను అప్ లోడ్ చేసేస్తే స‌రి. చాలా త‌క్కువ వ్య‌వ‌ధిలోనే వారి ఇంటి ముందుకు ఇసుక‌ను తీసుకొచ్చి దించేస్తారు ఏపీఎండీసీ అధికారులు. ఇందుకోసం ఏదో పెద్ద మొత్తంలో డ‌బ్బు చెల్లించాల్సిన అవ‌స‌రం కూడా లేదు.

ఇసుక ర‌వాణా చార్జీల‌తో పాటు ఇసుక‌కు ఏపీఎండీసీ నిర్ణ‌యించే చిన్న‌పాటి మొత్తాన్ని చెల్లిస్తే స‌రిపోతుంది. ఈ రేటు కూడా చాలా నామిన‌ల్ గా ఉంటుంద‌ట‌. ఇక ఇసుక కోసం ఆర్డ‌ర్ చేసే వారు ఆ మొత్తాన్ని వ్య‌క్తుల‌కు కాకుండా నేరుగా ఆన్ లైన్ లోనే చెల్లించేసేయొచ్చు. అంటే... ఎక్క‌డా అవినీతికి చోటు లేద‌న్న మాటే. ఇదే విధానం అమ‌ల్లోకి వ‌స్తే... నిజంగానే ఇసుకాసురుల‌కు చెక్ ప‌డిపోయిన‌ట్టే. ఇక ఇసుక విధానంలో ఆయా ప్రాంతాల్లో ఇసుక ల‌భ్య‌త‌ను బ‌ట్టి కృత్రిమ ఇసుక త‌యారీకి కూడా ప్ర‌భుత్వం చర్య‌లు చేప‌డుతున్న‌ట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా ఇసుక పాల‌సీకి సంబంధించి కొత్త విధానాన్ని అమ‌లు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న జ‌గ‌న్ స‌ర్కారు... ప్ర‌జ‌ల‌కు త‌న‌దైన సుప‌రిపాల‌న‌ను అందించేందుకు శ్రీ‌కారం చుట్టేస్తోంద‌న్న మాట‌.