Begin typing your search above and press return to search.

బాబూ..సాంబార్ ఇడ్లీ - శాలువా - జ‌గ‌న్ సెటైర్‌

By:  Tupaki Desk   |   20 Nov 2018 1:33 PM GMT
బాబూ..సాంబార్ ఇడ్లీ - శాలువా - జ‌గ‌న్ సెటైర్‌
X
" ఇక్కడ రాష్ట్రం కష్టాల కడలిలో ఈదులాడుతోంది. ప్రత్యేక హోదాను మీరు మరిచారు. పోనీ ఇక్కడి సమస్యలపై ద్రష్టి పెడతారా అంటే మీకు సాంబార్ ఇడ్లీ మీదా... శాలువాలు కప్పడం మీదా ఉన్న శ్రద్ధ రాష్టం మీద లేదు " ఇవీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధినేత - ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై చేసిన విమర్శలు. రాష్ట్రం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూంటే చంద్రబాబు నాయుడు చెన్నై వెళ్లి అక్కడ డిఎంకే అధినేత స్టాలిన్ తో సాంబార్ ఇడ్లీ తింటారని - పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌ కతా వెళ్లి అక్కడ మమతా బెనర్జికి శాలువాలు కప్పుతారని జగన్ ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లాలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి కురుపాంలో జరుగుతున్న బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్ర సమస్యలే సరిగా పరిష్కరించడం రాని చంద్రబాబు నాయడు జాతీయ స్ధాయి సమస్యలు పరిష్కరిస్తానంటూ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు.

" ఉట్టికి ఎగరేనమ్మ స్వర్గానికి ఎగిరింది అన్నట్లుగా ఉంది చంద్రబాబు నాయుడి పరిస్ధితి. రాష్ట్ర సమస్యల పరిష్కరించరు కాని అంతరిక్ష సమస్యలు సైతం పరిష్కరిస్తానంటారు చంద్రబాబు నాయడు " అని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. విజయనగరం జిల్లా కురుపాం తన తండ్రి వై.ఎస్ రాజశేఖ‌ర రెడ్డి హయాంలోనే అభివ్రద్ధి చెందిందని - చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అన్నదే లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో గ్రామంలోనూ కనీసం నాలుగైదు ఇళ్లు కూడా నిర్మించలేదని - రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదని మండిపడ్డారు. ఇక చంద్రబాబు నాయుడు - ఆయన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు గుడి - బడి అని తేడా లేకుంగా ఎక్కడ భూములు ఉంటే వాటిని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులున్నాయని - పండిన పంట దళారుల పాలు అయిన తర్వాత కొనుగోలు కేంద్రాలు తెరస్తున్నారని, దీని వల్ల ఎవరికి మేలు జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. రాజకీయంగా కూడా చంద్రబాబు నాయుడు దిగజారిపోయారని - ప్రజాప్రతినిధులను సంతలో పశువులను కొన్న తీరులో కొనుగోలు చేసి వారికి పదవులు కట్టపెట్టారని ఆరోపించారు. స్ధానిక శాసనసభ్యురాలు పుష్ప శ్రీవాణి పై వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధినేత జగన్ ప్రశంసల జల్లు కురిపించారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఆమె విలువలతో కూడిన రాజకీయాలు చేశారన్నారు.